మౌనంగా రోదించిన బుద్ధుడు !

Friday, 11 March 2011

ప్రతిష్టించిన నాటినుంచీ ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, శాంతియుత సందర్భాలను నవ్వుతూ వీక్షించిన తదాగతుడు, తనను ఇంత చక్కటి ప్రదేశంలో లిబర్టీ విగ్రహంలా టాంక్ బండ్ మధ్యలో ప్రతిష్టించి హైదరాబాదు లో జరిగే ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రత్యక్ష సాక్షిలా చేసి ప్రజలందరినీ దీవిన్చేలా తనకు గౌరవాన్ని ఇచ్చినందుకు తెలుగుజాతికి ఆశిస్సులిస్తూ ఉండేవాడాయన !
ఉత్సవంగా వచ్చి గణపతులను తెచ్చి నిమజ్జనం చేసే  ప్రజలను చూసి గర్వంగా చూసేవాడాయన ఎందుకంటే అన్ని మతాలవారూ, జాతుల వారూ, విదేశీయులు కూడా ఆ ఉత్సవంలో భాగం గా ఉండి, సర్వ మానవ సౌబ్రాత్రుత్వాన్ని , వసుధైక  కుటుంబకాన్ని  ప్రతిబింబించే వారు కాబట్టి ! 
రోజూ ఇంటినుంచి కార్యాలయాలకూ, పాటశాలలకూ, కళాశాలలకూ, వ్యాపారాలకూ వెళ్లి, మళ్ళీ ఇళ్ళకు మళ్లే హైదరాబాదీలను చూసి ముచ్చట పడే వాడా సిద్ధార్ధుడు ! తననూ, తన చుట్టూ ఉన్న వనాలనూ చూడటానికి వచ్చే పర్యాటకులను నవ్వుతూ పలకరించే వాడా శాంతి దూత !  
గోకుల్ చాట్ తో పాటు లేజర్ షో లో  జరిగిన బాంబు దాడికి ఉలిక్కి పడినా అది జరిపింది ఉగ్రవాదం ముసుగులో ఉన్న రాక్షసులు కాబట్టి వారిని శిక్షిస్తే చాలని సరిపెట్టుకున్నాడా బుద్ధుడు ! 
కే సి ఆర్ గారి కూతురు కవిత నేతృత్వంలో కోటి బతుకమ్మల జాతరను పరవశిస్తూ వీక్షించాడాయన ! ఇదే తల్లీ ఉద్యమాలు నడిపే పధ్ధతి, శాంతి యుతంగా సంఘటితంగా మన భావాన్ని తెలిపే స్పూర్తి అని ఆశీర్వదిన్చాడాయన !
నిన్న పోలీసుల ట్రాఫిక్ ఆక్షలను తట్టుకుని, పోలీసు రక్షణ వలయాలను చేదించి టాంక్ బండ్ చేరిన వేలాది మందిని ఉత్సాహంగా చూస్తూ ఆశీర్వదించే లోపు ఆ ఉద్యమం ముసుగులో ముష్కరులు చేస్తూన్న విద్వంసం చూసి తల్లడిల్లి పోయాడా బుద్ధుడు ! 
" ఆపండిరా ! ఇది తప్పురా ! తమ్ముడి పైన కోపం వస్తే తాతలను తంతారా ? " అని అరిచాడు కానీ అక్కడి జనం ఆయనను ఇంకో విగ్రహంగా చూసారు తప్ప పట్టించుకోలేదు !
ఉద్యమ స్పూర్తిని మరిచిన ఉన్మాదులను చూసి బెంబేలు  ఎత్తాడాయన ! తెలుగు వెలుగులా నిలిచిన పెద్దలను, అవమానిస్తూ కూల్చేస్తోంటే సిగ్గుతో తలవంచాడు ఆయన !
తనను వారితో బాటు టాంక్ బండ్ మీద కాక విద్వంసకారులకు  అందకుండా నీటి మధ్యలో ప్రతిష్టించి కూలినవారితో పాటు కూలిపోయే అవకాశం ఇవ్వనందుకు మౌనంగా రోదించాడు బుద్ధుడు !

  

2 comments:

పుల్లాయన said...

చాలా బాధాకరమైన సంఘటనలు.

పద్యాల విక్రమ్ కుమార్ P Vikram Kumaar said...

హుస్సేన్ సాగర్ వద్ద తెలుగు తేజోమూర్తులను అవమాని౦చేలా ప్రేరేపి౦చిన (ఉన్మాదులనిక /) వారినిక ఉపేక్షి౦చరాదు; అనవసర౦గా పె౦చుకున్న కక్షతో తమ ఉనికికి స్వేచ్ఛకు కారణమైన తెలుగు వెలుగుజ్యోతులను అవమాని౦చదలచడమ౦టే తమను తాము అవమాని౦చుకోవడమే. ఈమాత్రము తెలివిడిలేక దుస్సాహసాలు చేస్తున్న వేర్పాటువాదులచేతికి రాష్ట్రాన్ని ఎ౦దుకివ్వరాదో హుస్సేన్ సాగర్ ఘటన మరోసారి స్పష్ట౦ చేసి౦ది. అలా చేయబూనడ౦ పిచ్చివాడికి రాయి అ౦దివ్వడమే. మూర్ఖత్వ౦తో చెలరేగే ముష్కర మూకల రాక్షసత్వ౦ వల్ల ఇప్పటికే మనజాతి తలది౦చుకోవాల్సిన పరిస్థితి. శిఖరసమానులైన తెలుగు వెలుగుమూర్తులను అవమాని౦చడ౦ జాతీయ గీతాన్ని, పతాకాన్ని అవమాని౦చడమ౦తటి పాతక౦ కన్నా తక్కువే౦కాదు. దేశాభిమానము లవలేశమైనాలేని చీడపురుగులనిక చిదిమివేయాలి. ప్రజలను ఇబ్బ౦దికి గురిచేస్తూ వెఱ్ఱి వేషాలేస్తున్న వేర్పాటువాదులకు జీతాలివ్వరాదు. ఓయూ ఐకాసలో విద్యార్థులే లేరు. సమైక్యతతోటే సమగ్రాభివృద్ధి అని నిరూపి౦చిన ఆర్యజాతీయులారా.... ఎన్నాళ్ళీ మౌన౦? మ౦చివాడి మౌన౦ చాలా ప్రమాదకర౦ అని జె పి అ౦టు౦టారే....అది నిజమని పదేపదే నిరూపితమౌతున్నది. లేవ౦డి. సమున్నతమైన భారతీయతను కాపాడుకు౦దాము. అ౦దరినీ సమాయత్తపరచ౦డి. చరిత్రహీనులుగా మిగులవద్దు.

పత్రికలవారికి / ప్రసారసాధనాల వారికి విన్నపము - అయ్యలారా! ఇప్పటివరకూ తమరు చేసిన ఘనకార్యాలు చాలు. దయచేసి జాతీయసమైక్యతను చాటే వార్తలు, ప్రజల మధ్య సుహృద్భావాన్ని పె౦పొ౦ది౦చే అ౦శాలు మాత్రమే ప్రచురి౦చగలరు / ప్రసార౦ చేయగలరు.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )