రాజకీయాలలోకి ప్రవేశించే సమయంలో " నేను వచ్చేది సైకిల్ మీదో, కారు మీదో కాదు జనంతో నిండిన రైలు మీద " అని ఉద్వేగంగా ప్రకటించిన చిరంజీవి గారు, ఈ రోజు తన ప్రజారాజ్యం పార్టీ రైలు కి హస్తినాపురం లోని 10 జనపద్ చివరి స్టేషన్ గా ప్రకటించి రైలు ఆపేసి సోనియాగారి స్నేహ హస్తాన్ని అందుకున్నారు ! జనం పిలుస్తున్నారూ, రమ్మంటున్నారూ అని రెండు సంవత్సరాలు చాప కింద నీరులా రహస్య మంతనాలూ, రాజకీయ చర్చలూ చేసి తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఎన్.టీ.ఆర్. రికార్డు ని బద్దలు కొట్టాలనే ఆశతో పార్టీ నిర్ణయాన్ని తెలియజేయడానికి మీన మేషాలు లెక్కించిన చిరు ఎన్నికల తరువాత తనకు వచ్చిన సీట్లు అధికారాన్ని కట్టబెట్టడానికి సరిపోనివేకాక కనీసం ప్రతిపక్షనేత గా కూడా పిలిపించుకునే అర్హత కలిగించలేవని తెలుసుకుని 'మేగా'బాధ పడిపోయారు ! పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారన్న వార్తలు కూడా వచ్చి ఆయన ఇమేజ్ కి మచ్చ తెచ్చింది ! తాము ఎదగడానికి ఎటు వీలు దొరికితే అటు గంతులేసే రాజకీయ నాయకులు మిగతా పార్టీల లోంచి తన పార్టీలోకి గంతులేస్తుంటే వాళ్ళంతా తనను నమ్మి వచ్చారని ఆనందంగా చూసి గర్వంగా చాతీ ఎత్తుకు తిరిగిన చిరంజీవి గారికి తరువాత కాలంలో తన పార్టీని వీడి గంతులేస్తున్న జనాలను చూసి బెంగ పట్టుకుంది ! ఇలాగే ఉంటే 2014 లో జరిగే ఎన్నికలకు ( ముందే రాకుంటే ) అభ్యర్ధులను నిలబెట్టడానికి తన పార్టీకి జనం దొరకరేమో అనే భయం పెరిగిపోతూన్న చిరంజీవిగారికి తన ప్రజారాజ్యం పార్టీని మూసి వేయాలన్నా తన మెగా గౌరవానికి తగదేమో అనిపించి ఉంటుంది ! వై ఎస్ ఆర్ గారి అకాల మరణం తరువాత జరుగుతూన్నజగన్ సోనియాల (కాంగ్రెస్) కుమ్ములాటల్లో చిరంజీవిగారికి తన పార్టీలో ఉన్న ఏం ఎల్ ఏ ల సంఖ్యాబలం తో కాంగ్రెస్ ను కాపాడటం అనే ఒక వంక ద్వారా తన పార్టీకి సమాధి చేయడానికి మంచి కారణం దొరికి తన పరువు నిలబడే అవకాశం కనిపించింది ! ఎప్పటి నుంచో అవసరం అయితే కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తాం అని చిరంజీవిగారు ఎన్నిసార్లు ప్రకటించినా పట్టించుకోని కాంగ్రెస్ చివరికి జగన్ వైపు వెళ్ళే జనాలకు చెక్కు పెట్టడానికి దిగివచ్చి ఆంటోనీగారిని చిరంజీవిగారి ఇంటికి పంపి చిరంజీవిగారి దిగజారుతున్న పరువుకు ఒక మిధ్యా ప్రతిష్టను ఇచ్చి చిరంజీవిగారి ప్రజారాజ్యం రైలు ను ఢిల్లీ షెడ్డు కి లైను క్లియర్ చేసేసారు ! చిరంజీవిగారు సి ఏం పదవి లో ఎలా అయినా కూర్చుని తన మార్కు పరిపాలనను అందించుతారేమో అని వారి అభిమానుల ఆశాసూరీడు పైకి ఎగసాడేమో తెలీదు కానీ కాంగ్రెస్ వాళ్ళ పంచలు ఊడదీసి కొడతారేమో అనే ఆశతో వోట్లు వేసిన ఓ యాభై లక్షల ఓటర్లు మాత్రం నిరాశతో క్రుగిపోయి ఉంటారివాళ !
నీతి : రాజకీయాల్లో సామాజిక న్యాయం ఎడారిలో ఎండమావిలాంటిది ( ఎప్పుడోగానీ జరగనిది ) !
నీతి : రాజకీయాల్లో సామాజిక న్యాయం ఎడారిలో ఎండమావిలాంటిది ( ఎప్పుడోగానీ జరగనిది ) !
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )