నిన్నటితో మా ముంబాయి నగరం మీద ఆరుగురు పాక్ ఉగ్రవాదులు దాడి జరిపి సంవత్సరం పూర్తి అయ్యింది !
ఆహా ! ప్రతి చోటా ప్రార్థనలు, కార్యక్రమాలు, టీ వీ కవరేజ్ , హంగామా హడావుడి ! ఒక చోటైతే రెండు పార్టీలు వేరు వేరుగా సమావేశాలు నిర్వహించి పిలిచేసరికి, ఏ సమావేశానికి వెళ్తే భద్రమో తెలియక పాపం ఆ ఏరియా లోని పౌరులు ఇబ్బంది పడిపోయారు !తెల్లారేసరికి అంతా మళ్ళీ అదే నిశ్శబ్దం ! నిన్న ప్రత్యెక రక్షక దళం ఫ్లాగ్ మార్చ్ చేసింది ! కొత్త ఆర్మర్డ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ప్రదర్శిస్తూ వాళ్లు వెళ్ళారు ట్రిడెంట్ హోటల్ చౌపాటీ వరకూ ! ట్రిడెంట్ హోటల్ పై నుంచి రోడ్డుకు అటువేపు ఉన్న ఎయిర్ ఇండియా భవనం పై అంతస్తు వరకూ వైర్లు కట్టి మేము జనాలను ఈవిధంగా కాపాడగలం అని వాళ్లు చెప్పాలని చేసిన ప్రయత్నం హాస్యాస్పదంగా ఉండింది ! ఈ చిన్ని ప్రయత్నం కోసం వాళ్లు రెండు రోజుల నుంచీ ఎంతో భందో బస్తు తోనూ, మొత్తం మేరిన్ డ్రైవ్ మీదకు వాహనాలను అనుమతించకుండా ఉండగలగటం తోనూ ఏదో తిప్పలు పడ్డా, అకస్మాత్తు దాడులను ఎలా ఎదురుకుంటారో ఏవిధంగానూ చెప్పలేకపోయారు ! ఇప్పటికీ ఈ వీధులన్నీ అంతే అభద్రంగా ఉన్నాయన్నది నిత్యం మేము చూస్తున్న సత్యం ! సముద్ర మార్గాన్ని పహారా కాయడానికి ఇంకా పూర్తి గా కోస్ట్ గార్డ్లకు సరైన పడవలు ఇవ్వలేకపోయారన్నది జగమెరిగిన సత్యం ! ఆరోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా పక్షవాతం వచ్చిన రోగిలా ఫ్రీజ్ అయిపోయిన్దనేది ప్రతి ముంబై పౌరుడూ మరిచిపోలేని నిజం ! ఇప్పుడు అటువంటి అవసరం మా ఖర్మగాలి మళ్ళీ వస్తే వాటిని ఎలా ఎదుర్కో బోతున్నారో, ప్రతి పౌరుడూ అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎలా వ్యవహరించాలో ఏమైనా ప్రణాళిక చేసారన్న సూచనలే లేవు ! ఆ సమయం లో హోం మంత్రిగా పనిచేసిన పాటిల్ గారిని అప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందో మరిచిపోయి మళ్ళీ హోం మంత్రిగా చేసి చేతులు దులిపేసుకున్నారు ! చనిపోయినవాళ్ళకు, గాయపడిన వాళ్ళకూ పరిహారం ఇవ్వడం ఒక్కటే చేసేట్లయితే ప్రభుత్వం ఎందుకూ ? అది కూడా అందరికీ సరిగా ముట్టలేదని చెబితే అద్వానీని రాజకీయం చేస్తున్నావని నోరు పారేసుకుంటారు పాపం లోక్ సభలో !
మన దేశం లో సగటు పౌరుడికి సమాధానం చెప్పే తీరిక ఈ రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, సంభందిత అధికారులకు కానీ ఉన్నట్లు కనపడదు ! ఇదివరకు రోజుల్లో చెప్పినట్లు వ్యాధి వచ్చినాక మందులు వాడటం కన్నా వ్యాధినివారణ మంచిదనే మాట దెస భద్రతకూ అన్వయిస్తుంది ! అయిపోయిన వాటిని రంగులద్ది చూపించదమూ, సుదీర్ఘ చర్చలు చేయడం తప్ప నివారణకోసం చర్యలు ఎవరూ చేపట్టడం లేదు ! మీడియా కు కూడా ఇలాంటి సందర్భాలు వారి టీ ఆర్ పీ రేటింగులను పెంచుకునే మార్గంగా ఉపయోగపడుతున్నాయే కనీ సరైన దిశా నిర్దేశం కావటల్లేదు !
ఇంటినుంచి బయటకు వచ్చిన వారు మళ్ళీ ఇంటికెళ్ళే లోపు ఇంకో 26 / 11 , లేకపోతె ఇంకో గోకుల్చాట్,లుమ్భినీపర్క్ జంట పేలుళ్లు, ఇంకో మాలెగావ్ లాంటి సంఘటనలు జరక్కుండా వచ్చారంటే అది వాళ్ల అదృష్టమే కానీ మన ప్రభుత్వాల గొప్పదనం కాదని మళ్ళీ, మళ్ళీ తేలిపోతోంది !
ఇప్పటివరకూ ఇలాంటి విద్రోహ కాండలలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించడం కన్నా ఇంకేమీ చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను !
వార్షికోత్సవాలు జరిపితే సరిపోయిందా ?
Friday, 27 November 2009
Posted by ప్రభు at 11/27/2009 09:40:00 am
Subscribe to:
Posts (Atom)