తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !

Sunday 10 January 2010

మరో సారి తెలిసింది మనకందరికీ ! ఈ రాజకీయ నాయకులు ప్రజలకోసం కాదు పాటు పాడేది స్వలాభం కోసమని ! అంతే కాదు మనలో మానవత్వం ఎలా నశిస్తుందో కూడా మరో సారి తెలిసింది ! తమిళనాట మంత్రులు వాళ్ళ మోటార్ కేడ్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద దాడి జరిగి అతను గాయాలతో రక్తం ఓడుతూ బాధపడుతోంటే కారు దిగకుండా అతనికి వైద్య సహాయం సమయానికి అందిచకపోఎసరికి అతను మరణించాడు అని తెలిసినాక మరో సారి తెలిసింది మనకందరికీ, ఈ రాజకీయ నాయకులు ప్రజలకోసం కాదు పాటు పాడేది స్వలాభం కోసమని !

ఈ మధ్య కాలం లో అసలు మానవత్వం అనేది మిగిలి ఉందా అని అనుమానించే విధంగా మనమంతా ఉంటే, మరి మనం ఎన్నుకున్న నేతలు ఇంకెక్కడి నుంచో పుట్టుకు రాలేదు కదా ? పాపం కోట్లు ఖర్చు పెట్టి సీట్లు కొనుక్కొని, ఇంకెన్నో కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొని, ఎం ఎల్ ఏలు, ఎం పీ లు అయ్యి , నానా తంటాలు పడీ, అడ్డమైన కాళ్ళు పట్టుకొని మంత్రులయ్యేది ఎందుకు ? ఇలా రోడ్డున పోయే దానయ్యలను కాపాడటానికా ? ఎంత వాళ్ళని కాపాడటం కోసమే నియమించబడిన వారైనా, ఇలా వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు కారు దిగి కాపాడాలా ? ఆ బాంబులూ, గుళ్ళూ తగిలి పొతే వాళ్ళు పెట్టిన ఖర్చంతా ఎక్కడినుంచి తిరిగి వస్తుంది ? బ్రతుకుంటే పది స్కామ్స్ చేసుకుని స్విస్ బ్యాంకు కాతాలలో డబ్బు పెంచుకోవచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు దిగి వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది ? వాళ్లకు జీతాలు ఇచ్చి పెంచి పోషించేది ఇలా అవసరం అయినప్పుడు చావడానికేగా? అంతే వీళ్ళు ఎం చేస్తారు ఇంకా అంటే , ఖుషీలు చేస్తారు ! ఒకవేళ ఎవ్వరూ పట్టించుకోకపోతే తమ ఉనిఖిని చాటుకోవడం కోసం , అంతగా అయితే ఎవరికీ పట్టని విషయం కోసం పోరాటం సాగిస్తారు, నిరసనలు తెలియచేస్తారు, ఉత్తుత్తి నిరాహార దీక్షలు చేస్తారు, సామాన్య ప్రజానీకాన్ని, చిన్నారులను రెచ్చగొడతారు, డబ్బుకో పనులకో తమమీద ఆశ్రయించుకొని తిరుగుతున్న అనుచరులను ప్రేరేపించి విధ్వంసాలు సృష్టిస్తారు ! పొతే జనం పోతారు ! కాకపొతే పొరబాటున పనైతే జీవితాంతం నేతలుగా బతికేయొచ్చు ! అలాకాకపోతే ఎలాగూ గొడవలు ఆపడం కోసం ఎవరో ఒకరు ఎంతో కొంత ముట్ట చెప్పకపోరు ! అప్పుడు మళ్ళీ శాంతి దూతలు అయిపోతారు !
అందుకే మరి తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !
మనం కలిసున్నామా విడిపోతామా అని కాదు వాళ్లకు కావాల్సింది, వాళ్ళకెంత ముడుతోందని ! మనం ఎంత మూర్ఖంగా నమ్మితే అంత తియ్యగా మనను ముంచేస్తారు !
అందుకే మరి తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !

మనం మారమా ?

Friday 8 January 2010

హమ్మయ్య ! మన పెద్దలు అగ్గి రగల్చడం మాని శాంతియుత మార్గం లో ఆందోళనలు చేస్తాం అన్నారు, ఇంకా ఇబ్బంది లేదు పిల్లలకు అమూల్యమైన విద్యా సంవత్సరం నష్టం కాదు అని సంబర పడ్డాం ! దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా మేము ఈ సంవత్సరం పరీక్షలు రాస్తాం అని వెల్లడించి శాంతికి తమ వంతు సాయం చేసారు అని భావించి ఎంతో సేపు కాలేదు !
ఈ మీడియా సృష్టించిన భీబత్సం అందరికీ నిద్ర లేకుండా చేసింది ! ఎవడో ఊరూ పేరూ లేని వాడు, ఎందుకూ పనికి రాని ఒక నెట్ మేగజైన్ లో ఎప్పుడో రాసిన ఊహా జనిత వార్తను దురుద్దేశ్య పూర్వకంగా చర్చించిన టీవీ చానల్ ఒకటైతే, వాళ్ళు ఇలా చేసారు చూడండి అని సందట్లో సడేమియాగా మిగతా చానల్స్ విచక్షణా రహితంగా జరిపిన చర్చలు రాష్ట్రాన్ని అగ్నిగుండం లా మార్చేసాయి !
రాజ శేఖర్ రెడ్డి గారు మాహా నేత కాదని ఎవ్వరూ అనలేరు ! వారి చావు వెనుక కుట్ర ఉంటే బయట పెట్టి, దోషులని తేలిన కుట్ర దారులను ఉరికూడా తీయాలి ! అంతే కానీ మనమే శిక్షించాలని చూడటం ఎంత వరకూ సమంజసం ?
చిత్తశుద్ది లేని మీడియా ఇలా ప్రవర్తిస్తే, మనం గొర్రెల్లా అలా వెళ్లి ఆస్తులను ద్వంసం చేయడమేనా ? మనం ఇంతేనా ఎప్పుడూ ? మనం చేయ వలిసిన పనులు చేయం కానీ మనం చేయకూడని పనులకు ముందు ఉంటాం ! కొన్ని పట్టణాలు తప్ప మిగిలిన రాష్ట్రమంతా అభి వృద్ది లేకుండా ఉంటే మనం ఎన్నుకుంటున్న ఎం ఎల్ ఎ లనూ, ఎం పీ లనూ ఏమీ అడగం ! మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాం ! ధరలకు రెక్కలొచ్చి, మధ్య తరగతి వాడే పస్తులుంటుంటే, బీదవాళ్ళు ఎలా బ్రతుకుతారని పాలకులను నిలదీయం ! ఇంకా ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తాం ! ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం ! అవినీతి మండిపోతుంటే కిక్కురుమనం ! లక్షల కోట్ల నల్ల డబ్బు స్విస్ బ్యాంకులలో మగ్గుతుంటే అదేమిటని అడగం, వెనక్కు తెప్పించం ! అంత ధనం దోచిన వారెవ్వరని అడగం !
అసలు మనం మానవత్వం కలిగి ఉన్నామా ? మనం ఉచ్ఛ నీచాలను మరిచి పోయి ఈ విధంగా ప్రవర్తిస్తూ, మన పిల్లలు ఇలా అయిపోయారేమిటీ , ఇంత భావోద్వేషాలకు లోనవుతున్నారేమిటీ , ప్రతి చిన్నవిషయానికీ ఆత్మహత్యలెందుకు చేసుకున్టున్నారంటూ అడుగుతుంటాం !మనం గంజాయి గింజలు చల్లి తులసి చెట్టు పెంచాలని చూస్తే ఎలా కుదురుతుంది ? మన పిల్లలకు మనం ఇచ్చే భవిష్య లోకం ఇలానా ఉండేది ? మనం మారమా ? మన పిల్లలకు మంచి లోకాన్ని ఇవ్వలేమా ?

సహనం- శాంతి తేవాలి మనమే మళ్ళీ !