నా గృహ బడ్జెట్ !

Saturday, 17 March 2012


పొద్దున్నే లేచి వార్తాపత్రికలలో వచ్చిన శతక్కొట్టిన సచిన్ - చితక్కొట్టిన ప్రణబ్ ల కథనాలను చదువుతూ  ఇంకా కాఫీ ఇవ్వని శ్రీమతికి మరిచిపొయిందేమొ అని ఏమోయ్ అని వంటింటి వేపు కేక వేసేలోపు కొత్త కప్పులతో వస్తూ కనిపించింది మా ఇంటి దీపం !
 " ఏమిటిది రాణీ, ఎప్పుడూ లేనిది ఇంత చిన్న కప్పులు కొన్నావ్ ? ఇలా అయితే, రెండు రెండు కప్పులు తాగాల్సి వస్తూందేమో ? " ఎందుకైనా మంచిదని ఇంకో కాఫీకి టెండరు పెడుతూ అన్నాను !
" మన ఇంటి కొత్త బడ్జెట్టు ప్రకారం  కాఫీ ల కేటాయింపులలో యాభై శాతం కోత విధించడమైనది రాజా !  “  నా టెండర్ ను బుట్టదాఖలా చేస్తూ  రిటార్ట్ కొట్టింది మా గృహలక్ష్మి చిదంబరం లానో, ప్రణబ్ ముఖర్జీ లానో ఫీలయిపోతూ , ఒక కప్పు నాకు ఇచ్చి తనింకొటి తీసుకుని చప్పరిస్తూ తనూ సొఫాలో సెటిల్ అవుతూ !
" అంటే ఇంకో కాఫీ కష్టమేనంటావా నీరజాక్షీ ? "  మధురంగా ఉన్న కాఫీ  నెమ్మదిగా సిప్పుతూ, ఆశ చావక అడిగాను !
" తప్పదు కదా నంద నందనా ? మన గృహ బడ్జెట్టు కు లోటు పెట్టుకునే హక్కు మన ఆర్ధిక మంత్రిలా మనకు లేదు కదా ? మీరిచ్చిన దానిలోనే మిగల్చాలి కదా ? "  లా పాయింటు పీకింది మా అర్ధికవేత్త !
" అవును నీలవేణీ, ఈ కొత్త కప్పులు ఇంత బుల్లి సైజులో అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాయి ? "  కుతూహలంతో అడిగాను !
 " నాకు మన ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఉన్న అపారమైన నమ్మకం వల్ల కలిగిన లాభం ఇది నీలమేఘ శ్యామా,  ఈయన ఇలాంటి బద్జెట్ తొ కొడతాడనే, రెండు నెల్ల ముందే కొని పెట్టా ! మొన్న రెజైన్ చెయ్యక ముందు రైల్వే మినిష్టర్ కొట్టిన దెబ్బకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతాయని మీరే చెప్పారుగా ? ఇంక ఈయన విసిరిన బద్జెట్ అస్త్రాన్ని తట్టుకోవాలంటే మరి మనం కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు కదా ? " ఉత్సాహంగా చెబుతోంది నా అర్ధాంగి !
" ఇంకా ఏమేమి త్యాగాలు చేయబోతున్నాం దేవీ ? " గుండె గుబగుబ మనగా అడిగాను !
" ఏముందీ మీ సిగరెట్ల ఖర్చులో పాతిక శాతం కోతవిధిస్తున్నాం  మహాప్రభూ ! మీరు అప్పుడప్పుడూ కొట్టే మందుకు నిధులు బందు చేస్తున్నాం !  " రెచ్చిపోయింది నా భార్యామణి !
" అన్యాయం.. అక్రమం.. దారుణం ...  ఎదో నెలకు ఒకట్రెండు సార్లు మాత్రమే కదా మందు ఖర్చు ? " వాపోయాను, ఏ పేరూ పిలవకుండానే !
" ఆ ఒకట్రెండుసార్లకే ఎంత ఖర్చవుతోందో గమనించారా మరి ? " అంది తనూ పేరొదిలేసి !
పొమ్మనలేక పొగపెట్టినట్లు నాతో మందు మానిపించడానికి నువ్వు వేసే ఎత్తుకాదు కదా భార్యాశ్రీ ? " 
" మా భార్యలందరూ ఎన్ని ఎత్తులు వేసినా, ఆర్ధిక మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు  వీరబాదుడు బాదినా దున్నపోతు మీద వాన చందంలొ బ్రతికే మీ పొగరాయుళ్ళకూ, మందుబాబులకూ చీమకుట్టినట్లైనా అనిపించదని నాకు తెలుసు భర్తృహరీ ! 
ఇంక లాభం లేదని తన అసలు పేరుకే ఫిక్సయిపోయి " అదికాదు కృష్ణవేణీ, అన్ని ఇబ్బందు లూ నాకేనా ? ఇంకేమీ తగ్గించుకోలేమా ? " అన్నాను జాలిగా ముఖం పెట్టి !
" ఇంకా ఎందుకు లేవు భాస్కరరావ్ ?   మనం వారానికొకసారి బయటకు వెళ్ళి భోంచేసే దాన్ని ఇహనుంచీ ' పక్షం రోజులకొక బయటి భోజన పథకం' గా మార్చేస్తున్నాం ! " అంది మా అన్నపూర్ణ !
" హమ్మయ్య అంతే కదా కృష్ణా ? " ఆనందపడబోతూ అడిగాను !  
" అంతేనా అంటే ఇంకా చాలా ఉంది భాస్కర్ ! మనం ఇదివరకులా బయటికి భోజనానికి వెళ్ళినప్పుడల్లా  మల్తీప్లెక్స్ కి వెళ్ళి సినిమా చూడటం కుదరదు ! ఆంటే ఒకసారి భోంచేస్తాం ఇంకోసారి సినిమాకెళ్తాం అన్నమాట ! ఇంకా పనికిరాని విండో షాపింగ్ కూడా మానేస్తున్నాం ! ఇంకనుంచీ ఏమేమి అవసరమో ముందే రాసి పెట్టుకుని, మాల్ లో వాటిని మాత్రమే కొని ఇంటికి వచ్చేస్తాం ! మధ్యలో ఏ సేల్సు గర్లో, బాయో ఇకిలించి చెప్పారని కొత్త ప్రోడక్టులు కొనం !  మనం రేపటినుంచీ వేరువేరు బళ్ళమీద ఆఫీసుకు పోము ! మీరు నన్ను మా ఆఫీసు దగ్గర డ్రాపు చేసి  మళ్ళీ తీసుకొద్దురుగాని ! కుదరనప్పుడు బస్సులో వెళ్ళడమో లేకపోతే, షేర్ ఆటోలో వచ్చెయ్యడమో  చేస్తాలే తన స్కూటీ వేపు జాలిగా చూస్తూ చెప్పింది శ్రీమతి !
మన దేశ / రాష్ట్ర నాయకుల లాగా కాకుండా, తాను కూడా త్యాగం చేస్తున్నందుకు తన మీద జాలి చూపిస్తూ " పోనీ నీ స్కూటీ మీద నన్ను ఆఫీసులో డ్రాప్ చేసి పిక్ అప్ చేసుకుందువుగానిలే కృష్ణా " అన్నాను !
" అదెలా భాస్కర్ మీ ఆఫీసు మా ఆఫీసుకన్నా దూరం, పైగా మా ఆఫీసేమో మీ ఆఫీసుకెళ్ళే దారిలో ఉందాయే  నువ్వు నన్ను డ్రాప్ చేయడమే రైటు ! పొనీ అప్పుడప్పుడు నేను మా ఆఫీసుదాకా స్కూటీపైన వస్తా, అక్కణ్ణుంచి నువ్వు దాన్నే ఆఫీసుకి తీసుకెళ్దువుగాని ! " మధ్యే మార్గం సూచించింది శ్రీమతి !
స్కూటీ నడపడం కొద్దిగా ఇబ్బందిగానే ఫీలయినా, ఇంటి ఆర్ధిక స్థితిని మెరుగు పరచడం కోసం తను చేస్తున్న ప్రయత్నంలో అదేమంత కష్టమైన పని అనిపించలేదు నాకు !
చివరి కాఫీ చుక్క చప్పరిస్తూ పేపర్ వేపు చూసిన నా కళ్ళకు ఇంకో వార్త కనిపించింది
 " సీఎంకు  2.44 లక్షలు.. మంత్రులకు 2.42 లక్షలు - నెలసరి భత్యాలలో భారీగా పెంపు "
ధరలు పెరిగేదీ, పన్నులు పెరిగేదీ సామాన్యుడికే కానీ, రాజకీయనాయకులకు ఎప్పుడూ ఏ డోకా ఉండదని మళ్ళీ అర్ధం అయినాక ఇందాక మధురంగా అనిపించిన కాఫీ అకస్మాత్తుగా చేదనిపించింది !  

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )