గుండె గుప్పిట్లోకి వచ్చిన వేళ !

Wednesday 18 May 2011

బిగ్ బజార్ లో అవీ ఇవీ కొంటున్న సందేశ్ కి కాషియర్ తో మాట్లాడుతున్నా ఒక 5 / 6  సంవత్సరాల బాబు కనిపించి కుతూహలంగా దగ్గరికి వెళ్లి వాళ్ళ సంభాషణ విన్నాడు !
 కాషియర్  : " సారీ బాబూ ఈ బొమ్మను కొనడానికి నీ దగ్గరున్న డబ్బులు సరిపోవు ! "
సందేశ్ ని చూసిన బాబు  ఆశతో " చూడండి అంకుల్ ఈ బొమ్మకు నాదగ్గర ఉన్న డబ్బులు సరిపోవంటున్నారు కొద్దిగా చూసి చెప్పరా ? "
సందేశ్ ఆ బాబు దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని లెక్కపెట్టి, బొమ్మ ఖరీదుతో పోల్చి చూసి " నిజమేనమ్మా నీ దగ్గర ఉన్న డబ్బులు ఈ బొమ్మ కొనడానికి సరిపడా లేవు " అన్నాడు !
ఆ బొమ్మను ఇంకా గుండెకు హత్తుకుని నిలబడ్డ బుల్లి బాబును చూసి అతణ్ణి దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ అడిగాడు ! " ఎవరికోసం ఈ బొమ్మ కొంటున్నావ్ బాబూ ? "
" మా చెల్లి కి బర్త్ డే గిఫ్ట్ లా ఇద్దామని కొంటున్నాను అంకుల్  ఈ బొమ్మని ! మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అంటే నమ్మండి ! ఈ బొమ్మను తీసుకెళ్ళి మా అమ్మకిస్తే తను చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తుంది ! " బాధగా బొమ్మ వంక చూస్తూ చెప్పాడు బాబు !
" చెల్లేమో దేవుడి దగ్గిరికి  వెళ్ళింది కదా...
 అమ్మ త్వరలో దేవుణ్ణి చూడటానికి వెళ్తోందని డాడీ చెప్పారు !
 అప్పుడు బొమ్మమమ్మీ తీసుకెళ్తే  చెల్లికి ఇవ్వకలుగుతుంది అనిపించీ ... "
వింటున్న సందేశ్ గుండె ఒక్కసారి ఆగినట్లు అనిపించింది ! ఆ బాబు సందేశ్ కళ్ళలోకి చూస్తూ " నేను మమ్మీని అప్పుడే వెళ్లోద్దని చెప్పమని డాడీకి చెప్పాను అంకుల్ ! నేను ఈ బొమ్మను కొని తీసుకెళ్ళే దాకా ఉండాలి కదా ? " అంటూ తను బాగా హాయిగా నవ్వుతున్న ఫోటో చూపించాడు ఆ బుజ్జి బాబు !
" ఈ బొమ్మతో పాటు మమ్మీకి నా  ఫోటో కూడా ఇస్తున్నా అంకుల్ ఎందుకంటే అప్పుడు మా చెల్లి నన్ను మర్చిపో లేదుగా ?  మా మమ్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టం అంకుల్ ! తనను వదిలి ఉండలేనేమో కూడా !  కానీ డాడీ ఏమో చెల్లి దగ్గర ఉండటానికి తను వెళ్ళక  తప్పదు  అంటున్నారు !"  అంటూ ఆ బొమ్మ వంక నిరాశతో చూసాడు ఆ బుల్లి బాబు !
సందేశ్ వెంటనే తన జేబులో చెయ్యిపెట్టి బాబుతో " మళ్ళీ ఇంకో సారి చెక్ చేద్దామా నీ డబ్బులు బొమ్మకు సరిపోతాయో లేదో ? " అన్నాడు ?
" సరే అంకుల్ ! నా డబ్బులు సరిపోతే బావుండు ! " అన్నాడు ఆ బాబు మళ్ళీ చిగురించిన ఆశతో !
ఆ బాబు చూడకుండా తన జేబులోంచి కొంత డబ్బు తీసి బాబు డబ్బులతో కలిపి లెక్కపెట్టాడు సందేశ్ ! బొమ్మకు సరిపడా డబ్బులే కాక ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి అప్పుడు !
అది చూసిన బుజ్జి బాబు ఆనందం తో " థాంక్స్ దేముడా నా దగ్గర సరిపడా డబ్బులిచ్చినందుకు ! " అని " నిన్న రాత్రి నేను పడుకోబోయే ముందు దేముడికి ప్రేయర్ చేస్తూ చెప్పాను అంకుల్ ' దేముడా నాదగ్గర బొమ్మకు సరిపడా డబ్బులు ఉండేట్లు చూడు  అప్పుడు నేను కొని మా మమ్మీకి ఇస్తే తను   చెల్లికి ఇస్తుంది' అని చెప్పాను ! దేముడు నా మాట విన్నాడు చూసారా ? నాకైతే ఈ బొమ్మతో పాటు ఒక తెల్ల గులాబి కొనడానికి కూడా సరిపడా డబ్బులుంటే బావుంటుంది అనిపించింది కానీ అలా అన్నీదేముడిని అడగడానికి భయం వేసింది ! అయినా కానీ దేముడు బొమ్మతో పాటు తెల్ల గులాబీ పువ్వు కొనడానికి సరిపడా డబ్బులిచ్చాడు చూసారా ? మా మమ్మీకి తెల్లగులాబీలంటే చాలా ఇష్టం అంకుల్ ! "   
అలా ఆ బుల్లిబాబు సందేశ్ కి థాంక్స్ చెప్పే తన బొమ్మను తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ! సందేశ్ ఇందాకటికంటే విరుద్ధమైన మూడ్ తో  షాపింగ్ పూర్తి  చేసాడు కానీ తన ఆలోచనల నుండి ఆ బుజ్జిబాబును చెరిపెయ్యలేకపోయాడు  ! అతనికి అకస్మాతుగా రెండు రోజుల క్రితం న్యూస్ పేపర్ లో చదివిన వార్త గుర్తొచ్చింది !
' బాగా తాగి ఉన్న ఒక ట్రక్ డ్రైవర్ ఒక కారును గుద్దితే అందులో ఉన్న చిన్న పాప అక్కడికక్కడే మరణించిందనీ ఆ పాప తల్లి కూడా కోమాలో ఉందనీ, ఆ కుటుంబం ఎప్పటిదాకా  కోరుకుంటే అప్పటిదాకా  వెంటిలేటర్ మీద ఉంచుతారనీ అంతే తప్ప రికవర్ అయ్యే అవకాశం లేదనీ ' ఆ వార్త సారాంశం ! 
' ఈ బాబు ఆ కుటుంబానికి సంబంధించిన వాడు కాదు కదా ? ' అనుకున్నాడు సందేశ్ !
రెండురోజుల తర్వాత పేపర్ లో ఆ పాప తల్లి చనిపోయిందని చూసిన సందేశ్ తనను తానుకంట్రోల్ చేసుకోలేక ఒక తెల్లగులబీల గుచ్చాన్ని కొని బంధువుల దర్శనానికి ఆమె శరీరాన్ని ఉంచిన చోటికి వెళ్ళాడు ! అక్కడ ఆమె శరీరాన్ని ఒక గాజు బాక్స్ లో పెట్టి ఉంచారు ! ఆ బాక్స్ లో ఆమె గుండెల మీద కనిపించిన ఆ బుజ్జి బాబు నవ్వుతున్న ఫోటో,ఒక తెల్లగులాబీ, ఆ రోజు ఆ బాబు కొన్న బొమ్మ కనిపించి సందేశ్ కళ్ళను నీళ్ళతో నింపి వేసాయి ! తాను తెచ్చిన తెల్లగులాబీల గుచ్చాన్ని ఆమె శవ పేటిక   మీద వుంచి బయటికి నడిచిన సందేశ్ కి తన జీవితం మారిపోయినట్లు అనిపించింది ! 
ఆ తల్లి మీద, చెల్లి మీద ఆ బాబుకి ఉన్న ప్రేమను,  అనుబంధాన్ని ఒక్క క్షణం లో తుంచేసాడు  ఆ  తాగుబోతు ట్రక్ డ్రైవర్ !
అందుకే దయచేసి త్రాగిన మత్తులో వాహనాన్ని నడపకండి !

 
  

1 comments:

anrd said...

చెప్పలేనంత బాధాకరమైన సంఘటన. ఇలాంటివి ఎన్ని విన్నా ఆ కాసేపు శ్మశాన వైరాగ్యము..............మళ్ళీ ఎవరి స్వార్ధం వారిదే.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )