నేనైన నీవు

Friday, 9 April 2010


నా కష్టాలను నీవే అనుకున్నావు..
నా కన్నీళ్లను నీ కళ్ళలో కార్చావు..
నేనివ్వలేనని నీ కోర్కెలను చంపావు..
నీ వారిని వీడి నాస్వంతమయ్యావు..
నా గమ్యాన్ని నాతోటే చేరావు..
నా విజయానికి గర్విస్తూ నీ వైపు చూస్తే..
నన్ను గుండెలో నింపిన నువ్వు నాలానే ఉన్నావు..
నేనే నీవైన నీకు నేనేమివ్వగలను ప్రియా ?

అక్షర వనం

నా గుండె లోని భావాల సిరాతో,
నా కలంతో కవితలు నాటాలని,
నా గళజలంతో అవే పాటలు కావాలని,
నా జనం చప్పట్ల ఎరువుతో అవి వనంలా పెరగాలని,
ఎంత ఆశో చూడు నాకు....
తిండి గింజల వేటలో,
తిరిగి, తిరిగి అలిసిపోయే,
జనానికి అక్షరవనంలో తిరిగే తీరికేదీ ?

ఈ బంగారును కాల్చినవి చేతులా ?

Tuesday, 2 February 2010

కర్కశత్వం కరడు కట్టి..
కొలిమిలో కూనను కాలుస్తోంటే..
కళ్ళు తెరిచి నిద్రిస్తున్న కాకీ..
కొంగ జపం చేస్తోన్న ఖద్దరు..
కొన్నాళ్ళ కి మరిచిపోయే కాలనీలు..
కళ్ళు తెరవాలి.. నోళ్ళు మెదపాలి..
కారిన రక్తం ఇంకకముందే...
కారుతోన్న కన్నీళ్లు చల్లబడకముందే..
ఖూనీకోరుల కీళ్ళు విరిచే...
కొత్త చట్టాలు చేయించాలి...
కాళ్ళూ చేతులూ తీసి..
క్రూరం అనిపించినా..
కాలం చెల్లించాలి..

ఏడవకు తల్లీ... ఎదిరించడం నేర్చుకో !


పాపా నిన్ను ఓదార్చే శక్తి మాకున్నా..
ఎక్కడో ఉన్న చీడ పురుగు మా ధైర్యం పోగొట్టింది !
పనికి రాని నాయకుల రక్షణకు మేమిచ్చెంత ప్రాధాన్యం..
మా ప్రాణాలైన మీకు ఇవ్వలేని అసమర్ధులం !
మా లాంటి వెధవలం ఉన్నంత వరకూ..
నీ రక్షణ భారం నీదే అని చెప్పడానికి సిగ్గు కూడా రావట్లేదు !
నువ్వు మా అంత అయ్యే లోపు ఇంకెన్ని దారుణాలు చూడాలో..
గుండె రాయి చేసుకో ! శక్తి నీది పెంచుకో !
గుంట నక్కలతో, తోడేళ్ళతో, రక్తం మరిగిన పులులతో..
ఎదిరించడం నేర్చుకో ! తప్పించుకోవడం తెలుసుకో !
ఈ లోకంలో ఇంకో దారిలేదు తల్లీ..
మా కాలంలా మీకాలం లేనందుకు మమ్మల్ని క్షమించు !

తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !

Sunday, 10 January 2010

మరో సారి తెలిసింది మనకందరికీ ! ఈ రాజకీయ నాయకులు ప్రజలకోసం కాదు పాటు పాడేది స్వలాభం కోసమని ! అంతే కాదు మనలో మానవత్వం ఎలా నశిస్తుందో కూడా మరో సారి తెలిసింది ! తమిళనాట మంత్రులు వాళ్ళ మోటార్ కేడ్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద దాడి జరిగి అతను గాయాలతో రక్తం ఓడుతూ బాధపడుతోంటే కారు దిగకుండా అతనికి వైద్య సహాయం సమయానికి అందిచకపోఎసరికి అతను మరణించాడు అని తెలిసినాక మరో సారి తెలిసింది మనకందరికీ, ఈ రాజకీయ నాయకులు ప్రజలకోసం కాదు పాటు పాడేది స్వలాభం కోసమని !

ఈ మధ్య కాలం లో అసలు మానవత్వం అనేది మిగిలి ఉందా అని అనుమానించే విధంగా మనమంతా ఉంటే, మరి మనం ఎన్నుకున్న నేతలు ఇంకెక్కడి నుంచో పుట్టుకు రాలేదు కదా ? పాపం కోట్లు ఖర్చు పెట్టి సీట్లు కొనుక్కొని, ఇంకెన్నో కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొని, ఎం ఎల్ ఏలు, ఎం పీ లు అయ్యి , నానా తంటాలు పడీ, అడ్డమైన కాళ్ళు పట్టుకొని మంత్రులయ్యేది ఎందుకు ? ఇలా రోడ్డున పోయే దానయ్యలను కాపాడటానికా ? ఎంత వాళ్ళని కాపాడటం కోసమే నియమించబడిన వారైనా, ఇలా వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు కారు దిగి కాపాడాలా ? ఆ బాంబులూ, గుళ్ళూ తగిలి పొతే వాళ్ళు పెట్టిన ఖర్చంతా ఎక్కడినుంచి తిరిగి వస్తుంది ? బ్రతుకుంటే పది స్కామ్స్ చేసుకుని స్విస్ బ్యాంకు కాతాలలో డబ్బు పెంచుకోవచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు దిగి వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది ? వాళ్లకు జీతాలు ఇచ్చి పెంచి పోషించేది ఇలా అవసరం అయినప్పుడు చావడానికేగా? అంతే వీళ్ళు ఎం చేస్తారు ఇంకా అంటే , ఖుషీలు చేస్తారు ! ఒకవేళ ఎవ్వరూ పట్టించుకోకపోతే తమ ఉనిఖిని చాటుకోవడం కోసం , అంతగా అయితే ఎవరికీ పట్టని విషయం కోసం పోరాటం సాగిస్తారు, నిరసనలు తెలియచేస్తారు, ఉత్తుత్తి నిరాహార దీక్షలు చేస్తారు, సామాన్య ప్రజానీకాన్ని, చిన్నారులను రెచ్చగొడతారు, డబ్బుకో పనులకో తమమీద ఆశ్రయించుకొని తిరుగుతున్న అనుచరులను ప్రేరేపించి విధ్వంసాలు సృష్టిస్తారు ! పొతే జనం పోతారు ! కాకపొతే పొరబాటున పనైతే జీవితాంతం నేతలుగా బతికేయొచ్చు ! అలాకాకపోతే ఎలాగూ గొడవలు ఆపడం కోసం ఎవరో ఒకరు ఎంతో కొంత ముట్ట చెప్పకపోరు ! అప్పుడు మళ్ళీ శాంతి దూతలు అయిపోతారు !
అందుకే మరి తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !
మనం కలిసున్నామా విడిపోతామా అని కాదు వాళ్లకు కావాల్సింది, వాళ్ళకెంత ముడుతోందని ! మనం ఎంత మూర్ఖంగా నమ్మితే అంత తియ్యగా మనను ముంచేస్తారు !
అందుకే మరి తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !

మనం మారమా ?

Friday, 8 January 2010

హమ్మయ్య ! మన పెద్దలు అగ్గి రగల్చడం మాని శాంతియుత మార్గం లో ఆందోళనలు చేస్తాం అన్నారు, ఇంకా ఇబ్బంది లేదు పిల్లలకు అమూల్యమైన విద్యా సంవత్సరం నష్టం కాదు అని సంబర పడ్డాం ! దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా మేము ఈ సంవత్సరం పరీక్షలు రాస్తాం అని వెల్లడించి శాంతికి తమ వంతు సాయం చేసారు అని భావించి ఎంతో సేపు కాలేదు !
ఈ మీడియా సృష్టించిన భీబత్సం అందరికీ నిద్ర లేకుండా చేసింది ! ఎవడో ఊరూ పేరూ లేని వాడు, ఎందుకూ పనికి రాని ఒక నెట్ మేగజైన్ లో ఎప్పుడో రాసిన ఊహా జనిత వార్తను దురుద్దేశ్య పూర్వకంగా చర్చించిన టీవీ చానల్ ఒకటైతే, వాళ్ళు ఇలా చేసారు చూడండి అని సందట్లో సడేమియాగా మిగతా చానల్స్ విచక్షణా రహితంగా జరిపిన చర్చలు రాష్ట్రాన్ని అగ్నిగుండం లా మార్చేసాయి !
రాజ శేఖర్ రెడ్డి గారు మాహా నేత కాదని ఎవ్వరూ అనలేరు ! వారి చావు వెనుక కుట్ర ఉంటే బయట పెట్టి, దోషులని తేలిన కుట్ర దారులను ఉరికూడా తీయాలి ! అంతే కానీ మనమే శిక్షించాలని చూడటం ఎంత వరకూ సమంజసం ?
చిత్తశుద్ది లేని మీడియా ఇలా ప్రవర్తిస్తే, మనం గొర్రెల్లా అలా వెళ్లి ఆస్తులను ద్వంసం చేయడమేనా ? మనం ఇంతేనా ఎప్పుడూ ? మనం చేయ వలిసిన పనులు చేయం కానీ మనం చేయకూడని పనులకు ముందు ఉంటాం ! కొన్ని పట్టణాలు తప్ప మిగిలిన రాష్ట్రమంతా అభి వృద్ది లేకుండా ఉంటే మనం ఎన్నుకుంటున్న ఎం ఎల్ ఎ లనూ, ఎం పీ లనూ ఏమీ అడగం ! మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాం ! ధరలకు రెక్కలొచ్చి, మధ్య తరగతి వాడే పస్తులుంటుంటే, బీదవాళ్ళు ఎలా బ్రతుకుతారని పాలకులను నిలదీయం ! ఇంకా ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తాం ! ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం ! అవినీతి మండిపోతుంటే కిక్కురుమనం ! లక్షల కోట్ల నల్ల డబ్బు స్విస్ బ్యాంకులలో మగ్గుతుంటే అదేమిటని అడగం, వెనక్కు తెప్పించం ! అంత ధనం దోచిన వారెవ్వరని అడగం !
అసలు మనం మానవత్వం కలిగి ఉన్నామా ? మనం ఉచ్ఛ నీచాలను మరిచి పోయి ఈ విధంగా ప్రవర్తిస్తూ, మన పిల్లలు ఇలా అయిపోయారేమిటీ , ఇంత భావోద్వేషాలకు లోనవుతున్నారేమిటీ , ప్రతి చిన్నవిషయానికీ ఆత్మహత్యలెందుకు చేసుకున్టున్నారంటూ అడుగుతుంటాం !మనం గంజాయి గింజలు చల్లి తులసి చెట్టు పెంచాలని చూస్తే ఎలా కుదురుతుంది ? మన పిల్లలకు మనం ఇచ్చే భవిష్య లోకం ఇలానా ఉండేది ? మనం మారమా ? మన పిల్లలకు మంచి లోకాన్ని ఇవ్వలేమా ?

సహనం- శాంతి తేవాలి మనమే మళ్ళీ !

వార్షికోత్సవాలు జరిపితే సరిపోయిందా ?

Friday, 27 November 2009

నిన్నటితో మా ముంబాయి నగరం మీద ఆరుగురు పాక్ ఉగ్రవాదులు దాడి జరిపి సంవత్సరం పూర్తి అయ్యింది !
ఆహా ! ప్రతి చోటా ప్రార్థనలు, కార్యక్రమాలు, టీ వీ కవరేజ్ , హంగామా హడావుడి ! ఒక చోటైతే రెండు పార్టీలు వేరు వేరుగా సమావేశాలు నిర్వహించి పిలిచేసరికి, ఏ సమావేశానికి వెళ్తే భద్రమో తెలియక పాపం ఆ ఏరియా లోని పౌరులు ఇబ్బంది పడిపోయారు !తెల్లారేసరికి అంతా మళ్ళీ అదే నిశ్శబ్దం ! నిన్న ప్రత్యెక రక్షక దళం ఫ్లాగ్ మార్చ్ చేసింది ! కొత్త ఆర్మర్డ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ప్రదర్శిస్తూ వాళ్లు వెళ్ళారు ట్రిడెంట్ హోటల్ చౌపాటీ వరకూ ! ట్రిడెంట్ హోటల్ పై నుంచి రోడ్డుకు అటువేపు ఉన్న ఎయిర్ ఇండియా భవనం పై అంతస్తు వరకూ వైర్లు కట్టి మేము జనాలను ఈవిధంగా కాపాడగలం అని వాళ్లు చెప్పాలని చేసిన ప్రయత్నం హాస్యాస్పదంగా ఉండింది ! ఈ చిన్ని ప్రయత్నం కోసం వాళ్లు రెండు రోజుల నుంచీ ఎంతో భందో బస్తు తోనూ, మొత్తం మేరిన్ డ్రైవ్ మీదకు వాహనాలను అనుమతించకుండా ఉండగలగటం తోనూ ఏదో తిప్పలు పడ్డా, అకస్మాత్తు దాడులను ఎలా ఎదురుకుంటారో ఏవిధంగానూ చెప్పలేకపోయారు ! ఇప్పటికీ ఈ వీధులన్నీ అంతే అభద్రంగా ఉన్నాయన్నది నిత్యం మేము చూస్తున్న సత్యం ! సముద్ర మార్గాన్ని పహారా కాయడానికి ఇంకా పూర్తి గా కోస్ట్ గార్డ్లకు సరైన పడవలు ఇవ్వలేకపోయారన్నది జగమెరిగిన సత్యం ! ఆరోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా పక్షవాతం వచ్చిన రోగిలా ఫ్రీజ్ అయిపోయిన్దనేది ప్రతి ముంబై పౌరుడూ మరిచిపోలేని నిజం ! ఇప్పుడు అటువంటి అవసరం మా ఖర్మగాలి మళ్ళీ వస్తే వాటిని ఎలా ఎదుర్కో బోతున్నారో, ప్రతి పౌరుడూ అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎలా వ్యవహరించాలో ఏమైనా ప్రణాళిక చేసారన్న సూచనలే లేవు ! ఆ సమయం లో హోం మంత్రిగా పనిచేసిన పాటిల్ గారిని అప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందో మరిచిపోయి మళ్ళీ హోం మంత్రిగా చేసి చేతులు దులిపేసుకున్నారు ! చనిపోయినవాళ్ళకు, గాయపడిన వాళ్ళకూ పరిహారం ఇవ్వడం ఒక్కటే చేసేట్లయితే ప్రభుత్వం ఎందుకూ ? అది కూడా అందరికీ సరిగా ముట్టలేదని చెబితే అద్వానీని రాజకీయం చేస్తున్నావని నోరు పారేసుకుంటారు పాపం లోక్ సభలో !

మన దేశం లో సగటు పౌరుడికి సమాధానం చెప్పే తీరిక ఈ రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, సంభందిత అధికారులకు కానీ ఉన్నట్లు కనపడదు ! ఇదివరకు రోజుల్లో చెప్పినట్లు వ్యాధి వచ్చినాక మందులు వాడటం కన్నా వ్యాధినివారణ మంచిదనే మాట దెస భద్రతకూ అన్వయిస్తుంది ! అయిపోయిన వాటిని రంగులద్ది చూపించదమూ, సుదీర్ఘ చర్చలు చేయడం తప్ప నివారణకోసం చర్యలు ఎవరూ చేపట్టడం లేదు ! మీడియా కు కూడా ఇలాంటి సందర్భాలు వారి టీ ఆర్ పీ రేటింగులను పెంచుకునే మార్గంగా ఉపయోగపడుతున్నాయే కనీ సరైన దిశా నిర్దేశం కావటల్లేదు !

ఇంటినుంచి బయటకు వచ్చిన వారు మళ్ళీ ఇంటికెళ్ళే లోపు ఇంకో 26 / 11 , లేకపోతె ఇంకో గోకుల్చాట్,లుమ్భినీపర్క్ జంట పేలుళ్లు, ఇంకో మాలెగావ్ లాంటి సంఘటనలు జరక్కుండా వచ్చారంటే అది వాళ్ల అదృష్టమే కానీ మన ప్రభుత్వాల గొప్పదనం కాదని మళ్ళీ, మళ్ళీ తేలిపోతోంది !

ఇప్పటివరకూ ఇలాంటి విద్రోహ కాండలలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించడం కన్నా ఇంకేమీ చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను !