పెద్దాయనకు కోపం వచ్చింది !

Wednesday, 29 September 2010

ఆ రోజు ముసురు పట్టి ఉంది. నేను ఏదో పనిమీద అటునించి వస్తూ, ఎలాగూ టయిం అయ్యింది కాబట్టి మా వాడిని కాలేజీ అవగానే బండి మీద తీసుకు వెళ్తే బస్సు ఎక్కాల్సిన బాధ  వాడికి ఇవ్వాల్టికి తప్పుతుంది, అని వాడి కాలేజీ దగ్గర వెయిట్ చేస్తున్నాను. చిన్నగా జల్లు పడుతుంటే కాలేజీ వరండా కిందికి చేరాను. వరండాలోంచి చూస్తే సాయంత్రం 4.30 కే చీకటి  పడుతున్నట్లు ఉంది.  అలవాటు ప్రకారం చుట్టూ ఉన్నవాళ్ళను గమనించడం మొదలు పెట్టాను.  రోడ్డుకి అటువేపు కొద్దిగా దూరంగా ఒక చెప్పులు కుట్టే పెద్దాయన  ఎందుకో నన్ను ఆకర్షించాడు.  కాలేజీ పార్కింగ్ (రోడ్డు మీదే లెండి ) లో మోటార్ సైకిల్స్  పెట్టి ఉన్నాయి. దాని ప్రక్కనే ఉన్న చెట్టు కింద  చిన్న చెక్కలతో చేసిన షాపు ముందు నీళ్ళు పడకుండా కట్టిన ప్లాస్టిక్ షీట్ల  కింద  చెప్పులు కుట్టే పెద్దాయన భార్యతో కలిసి కూర్చుని ఎవరైనా వస్తారేమో అని ఆశగా దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఈయన షాప్ కు పక్కనే పార్కయ్యింది. కారతను పార్క్ చేసిన తరువాత కారులోనే కూర్చొని ఎవరికోసమో ఎదురు  చూడటం మొదలు పెట్టాడు. ఇంక ఈ పెద్దాయనకు విపరీతమైన టెన్షన్ మొదలయ్యినట్లు ఉంది. ఎవరికైనా చెప్పులు కుట్టించుకోవాలని అనిపిస్తే తన షాపు కనిపించదేమో ఎలా అని బాగా బెంగ పట్టుకుంది. లేచి నిల్చుని కొద్దిగా ముందుకు వచ్చి అటూ ఇటూ చూసాడు. మళ్ళీ వెళ్లి భార్య దగ్గర కూర్చుని ఆమెతో ఏదో అన్నాడు ఆమె తల అడ్డంగా తిప్పి ఏదో అంది. అంతే పక్కనే ఉన్న న్యూస్ పేపర్ గుండ్రంగా  కర్రలా చుట్టి  ఆమెను దానితో గట్టిగా కొట్టాడు. ఆమె పాపం కిక్కురు మనకుండా కూర్చుంది. ఇలా ఒక రెండు సార్లు జరిగింది. మూడో సారి లేచి కోపంగా కారులో కూర్చున్న అతని దగ్గరకు వెళ్ళాడు కోపంగా ఏదో అన్నాడు. కారు అడ్డం తీయమని అంటున్నాడని అర్ధం అయ్యింది. పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్ళ ముందు పెట్టమని సైగ చేసాడు పెద్దాయన.  మరి మోటార్ సైకిళ్ళు తీయడానికి అడ్డం వస్తుందనో, నేనెందుకు తీయాలనో కారులో ఉన్నాయన ఒప్పుకోలా. పెద్దాయన కోపంతో ఊగిపోతూ పార్కింగ్ దగ్గరున్న సెక్యూరిటీ అతనిని గట్టిగా పిలిచాడు. అతను వచ్చి విని ఈ పెద్దాయనకే ఏదో చెప్పాడు. బహుశా పార్కింగ్లో పెట్టింది తీయమనలెం అని అయి ఉంటుంది. మళ్ళీ భార్యదగ్గారికి  వెళ్లి ఏదో అన్నాడు ఆమె నోరు ఎత్తలేదు. కోపంతో ఊగిపోతూ పేపర్ చుట్టతో మళ్ళీ కొట్టాడు. మౌనంగా చీర చెంగుతో కళ్ళు వత్తుకున్దామే.  షాపులో ఉన్న చెప్పులు కుట్టే సామాగ్రి ఎత్తి గిరవాటు వేయబోయాడు పెద్దాయన. ఇంతలో ఒక ఇద్దరు అమ్మాయిలు షాప్ దగ్గరకు వచ్చి తెగిన చెప్పు చూపించారు. పెద్దాయన మోహంలో అకస్మాతుగా ఆనందం కనిపించింది.గబా గబా చెప్పు తీసుకుని కుట్టి ఇచ్చేసాడా పెద్దాయన. ఇంతలోనే ఇంకో కారు వచ్చి ఆ పెద్దాయన షాప్ ముందే ఆగింది. అందులో నుంచి దిగినతను తన చెప్పులు రిపేర్ చేయించు కున్నాడు. ఇంక పెద్దాయన హుషారుగా మారిపోయాడు. భార్యతో జోకులేయడం మొదలు పెట్టాడు. ఆమె చిన్నగా అలిగింది. పెద్దాయన లేచి పక్కనున్న టీ బంకు దగ్గరనుంచి టీ తెచ్చి భార్యకు ఇచ్చి తను  తీసుకుని తాగుతూ కబుర్లు చెబుతూ  ఆమెను నవ్వించాడు. తరువాత మళ్ళీ లేచి కారు దగ్గరికి వచ్చి కారతనితో కూడా నవ్వుతూ మాట్లాడాడు. కారతను పెద్దాయన వైపు అయోమయంగా చూసాడు. ఇంతకు ముందు తనతో మాట్లాడిన విధానికీ, ఇప్పటి తీరుకీ ఉన్న తేడా ఎందుకో అతనికి అర్ధం అయినట్లు లేదు. మొహం ముడుచుకుని కూర్చున్నాడు  ఆ కారతను పెద్దాయన వేపు చూడకుండా.  పెద్దాయన తను చెప్పాల్సింది తను చెప్పెసినట్లు ఫీలయిపోయి మళ్ళీ భార్యదగ్గరికి వెళ్లి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చుట్ట వెలిగించాడు. ఇంక ఈ రోజుకి  చెప్పులు కుట్టించుకోవడానికి ఎవరూ రాకపోయినా ఆపెద్దాయనకు కోపం రాదనుకుంటాను. అలా ఆ పెద్దాయన కాళీ కడుపుకూ, నిండిన కడుపుకూ ఉన్న తేడాను కొద్దిసేపట్లోనే కళ్ళ ముందు కట్టేలా చేసాడు.

రోడ్డెక్కిన పులులూ - మునుగుతున్న నగరాలూ

Tuesday, 28 September 2010

మొన్నీ మధ్య బీహార్లో కొన్ని ఏనుగులు సమూహంగా గూడ్స్ బండి డీ కొట్టడం వల్ల  రైలు పట్టాల మీద మరణించాయి. అయితే అది అభయారణ్యం కాబట్టి రైళ్ళు నడిపే వారు చూసుకు నడప వలిసిన బాధ్యత ఉంది.
ఆ మధ్య హైదరాబాద్లో కూడా ఒక చిరుత తిరిగింది. అలాగే  తిరుమలలో చిరుతలు దాడి చేసాయనీ, ఇంకెక్కడో  ఇళ్ళమీదికి ఎలుగు బంట్లు వచ్చాయనీ, వాళ్ళ హాస్టల్ లోకి వచ్చిన ఒక 10 అడుగుల కొండచిలువని ఆడపిల్లలు కలిసి చంపెసారానీ విన్నాం.  ఘనత వహించిన కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్ లో కూడా పాములు వచ్చాయని విన్నాం. ఈ జంతువులన్నీ ఇలా ఊళ్ళ మీదికి ఎందుకొస్తున్నాయి అంటారూ ? నాగరికతకు దూరంగా ఉండవలిసిన వన్యప్రాణులు రోడ్లమీద సంచరించడం ప్రమాద ఘంటికలు మ్రోగించడం లేదా ? వాటికి అరణ్యంలో భద్రతా, ఆహారం కరువైపోయాయని తెలియడం లేదా?
ఇదివరకు వానాకాలం వస్తోందీ అంటే ఒక సుందరమైన అనుభూతి కలిగేది. వానా వానా వల్లప్పా అంటూ వానలో తిరిగే  పిల్లలూ, కాగితం పడవలు చేసిస్తే వాటిని పారుతున్న వాననీటిలో వదిలి, అవి మునిగేంతవరకూ వెంట పరిగెత్తే పిల్లలూ, ఆకాశంలో అబ్బురంగా ఏర్పడే ఇంద్రధనుస్సులూ, వేడి వేడి  మిరపకాయ బజ్జీలూ, పకోడీలూ తింటూ వాన చినుకుల సరిగమలు వింటూ గడిపిన క్షణాలూ, కనీసం ఒక్కసారైనా వానలో తడవాలని పడ్డ తపనలూ  గుర్తుకు తెచ్చుకొని సరదా పడేవాళ్ళం. ఇప్పుడేమో  వానొస్తోందంటే గుండె గతుక్కు మంటోంది. రోడ్డు ఎక్కాలంటే  పడవ ప్రయాణాలు  చెయ్యాల్సిన పరిస్తితులు, సెల్లారులలోకి ఇళ్ళలోకి వచ్చి వెళ్ళని వరద నీరు, కొండలను లోయలను గుర్తుకు తెచ్చి, నడుము విరగకొట్టే రోడ్లు, తెరిచి ఉంది సుడిగుండంలా  మింగేసే మాన్ హోల్లు, పెరిగిపోయే మురుగూ, ముంచుకొచ్చే జ్వరాలూ గుర్తొచ్చి ఇల్లు కదలబుద్దే కాదు.
 వాతావరణం లో ప్రతి సంవత్సరం వస్తోన్న మార్పులూ మన ప్రస్తుత జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలన్నది సూచించడం లేదా ? ప్రకృతిని సరిగా అర్ధం చేసుకోకుండానే ప్రకృతితో ప్రయోగాలు చేసి,  నదుల దారులు మళ్ళించి పుడమి జీవన సమ తుల్యాన్ని అస్తవ్యస్తం చేయడానికి మనకు ఎవరిచ్చారు హక్కు ? పర్యావరణాన్ని విషతుల్యం చేస్తూ, పచ్చదనం పరిశుభ్రం అని ఒక పక్క అంటూ ఇంకో వైపు  పచ్చని చేలనూ, అడవులనూ నాశనం చేస్తూ తరిగిపోతున్న సేద్యంతో, పెరిగిపోతున్న జనాభాకు తిండి ఎలా పెడదాం అనుకుంటున్నారు ? తగ్గిపోతున్న అడవినీడతో మరి వన్య ప్రాణులు ఎక్కడికి  పోతాయి ? కనిపించిన దాన్ని కనిపించినట్లు చంపుకుంటూ పొతే రేపు ఆ ప్రాణులను కూడా అవతార్ సినిమాలో లాగా  కృత్రిమంగా సృష్టించి చూపితే అవి ఒకప్పుడు ఉండేవి అంటే నమ్మలేని స్తితి కూడా ఎంతో దూరంలో లేదు. 2012 లో ప్రళయం వస్తుందో లేదో తెలీదు కానీ, సమతుల్యం చెడిన భూమి, ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన ఆకాశ హార్మ్యాలూ, భవనాలూ, ప్రాజెక్టులూ, మనం ఏమైపోతామో ఆలోచించండి.

పబ్ కి వెళ్తుంటారా ?

Monday, 27 September 2010

యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు భూతం  ఊడల మర్రిలా ఇట్లా ఎలా పాతుకుపోయిన్దంటారూ ? ప్రతి తరం లోనూ పెద్దలకూ, పిల్లలకూ ఉన్న జనరేషన్ గాప్ ను తిట్టుకోవడం, పిల్లలు చెడిపోతున్నారని బాధ పడటమూ ఉంది.  పూర్వకాలంలోనూ దారితప్పి మత్తుకు బానిసలై తామూ, తమతో పాటు తమవారినీ నరకయాతనలకు గురిచేసుకున్న యువకులుండేవారు. కానీ వాళ్లకు తెలియకుండా వాళ్ళను ఉచ్చులో బిగిస్తూన్న పబ్ కల్చర్ ఇదివరకు లేకపోవడం వల్ల ఈ బూతం ఇంత బలాన్ని పొందలేకపోయింది. మనం పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతాం. వాళ్ళడిగినవీ, అడగనివీ అన్నీ కొనిచ్చి, వాళ్ళ కోసం వాళ్ళు కోరిన, లేక మనం కోరుకున్న మార్గం లో వాళ్ళను నడిపించడం కోసం ప్రయత్నిస్తుంటాం.  వాళ్ళు  చేరాలని చేరలేకపోయిన ఎత్తులకు వాళ్ళ పిల్లలను చేర్చాలనుకునే, తాము కన్న కలలను  తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకొనే తల్లిదండ్రులు ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు. దానికి తగ్గట్టు కొందరు పిల్లలు తల్లి తండ్రులను వారి కోర్కెలు సాధించడం కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటం కూడా చూస్తూనే ఉన్నాం.
పిల్లల కోర్కెలు తీర్చడానికి తమ బడ్జెట్ కు మించినదైనా వెరవక అప్పో సప్పో చేసినా వారడిగిన సెల్లుఫోనో, వీడియో గేమో, మోటార్ సైకిలో, లాప్టాప్ నో  కొని,  అడిగినంత డబ్బూ ఇచ్చి  పిల్లలను సంతృప్తి పరుస్తూన్న తల్లితండ్రులు కూడా పెరిగిపోతున్నారు. పెరిగిన పోటీతత్వం లో తమకు అవసరమైనంత కాక ఇతరులతో సమానంగానో, ఇతరులకన్నా ఎక్కువగానో తాముండాలనీ, తమపిల్లలను ఉంచాలని కొందరు తల్లితండ్రులు పరుగులు తీస్తున్నారు. తమ తమ  కోర్కెల సాధనకోసం వారు ఎక్కువ సమయాన్ని ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వినియోగిస్తున్నారు. ఎప్పుడైనా సమయం ఖాళీగా దొరికినా ఆ సమయాన్ని పిల్లలతో మానసికంగా పంచుకోవడం కన్నా తమ తమ గొప్పదనాన్ని ఇతరులకు చాటడంలో వినియోగిస్తున్నారు.  ఎవరో  పార్టీ ఇచ్చారని వీరివ్వడమూ, ఎవరో డ్రింక్స్ సర్వ్ చేసారని వీళ్ళు సర్వ్ చేయడమూ కూడా చేస్తున్నారు. స్వయంగా తామే పబ్బులకు వెళ్తూ అందులో తప్పులేదనే ఉద్దేశ్యంతో ఉండే తల్లితండ్రులు పెరిగిపోవడంతో, పిల్లలు పబ్ కెళ్తే,  కాదనీ లేదా తప్పనీ  ఎలా అనగలరు ?  అంటే డ్రింక్స్ తీసుకున్న వాళ్ళంతా పాడై పొయారనో, పాపాలు చేసారనో చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. పూర్వం మన తల్లితండ్రుల నియంత్రణ వల్లో, లేకపోతే మన అదృష్టం వల్లో మనకు ప్రస్తుత పరిస్తితుల వంటి పరిస్తితులు లేక మనకు ఈ బూతం బారిన పడటానికి తక్కువ అవకాశాలు ఉండేవి.  ఇంక యువతరం లో కూడా విద్య వెంటనే ఎంతో ఎక్కువ జీతాలు ఇస్తూ  ఉద్యోగాలు వెతుక్కుంటూ కళాశాలలోనే దొరకుతూ ఉండటం తో, ఖర్చుల పై నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం లేదనే భావం ఎక్కువవుతోంది. ఆలస్యంగా ఇంటికి వెళ్తే ఎందుకాలస్యం అయిందని అడిగేవారు లేకపోవడంతో పబ్ లలోనే తమ ఆనందాల్ని వెతుక్కొంటోంది యువతరం ( అందరూ కాదండీ ). ఇంక పబ్ లలో  బీరు, విస్కీ ల మత్తులో తూగుతున్న వారిని మాదకద్రవ్యాల వైపు మళ్లిస్తోంది మాఫియా. వారికి తెలియకుండా వారి గ్లాసుల్లో చేరిన, లేదా వారి సిగరెట్లో కూరిన మాదకద్రవ్యాల నిషాకు  నెమ్మది నెమ్మదిగా బానిసలైపోతున్నారు కొందరు పిల్లలు. స్లోగా మాదకద్రవ్యాలు తీసుకోకపోతే గడవని స్తితికి చేరిపోతున్నారు.  ఇంక తరువాత వారిపని ఏమిటి ? వాళ్ళు కష్టపడి సంపాయించిన జీతం రాళ్ళను, లేదా తల్లితడ్రుల వద్దనుంచి పొందిన పాకెట్ మనీ ని సమర్పించుకొని,  అది సరిపోక ఇంట్లో వాళ్లకు తెలియకుండా చిన్న చిన్న వస్తువులు దొంగిలించడమూ  , అమ్మేయడమూ మళ్ళీ మళ్ళీ మత్తులో మునిగి పోవడమూ. అది కూడా అయిపోయిన తరువాత   ఇంట్లో వాళ్ళకు విషయం  తెలిసినాక, ఇంక నిర్భీతిగా ఇంట్లో వాళ్ళతో పోట్లాడి, కొట్టి చేతికందినవి ఎత్తుకుపోవడమూ, కుదరకపోతే మాఫియా వారు చెప్పిన చిన్న చిన్న క్రయిమ్లూ, అవి దాటినాక పెద్ద పెద్ద క్రయిమ్లూ చేస్తూ చివరికి దేశ ద్రోహం చేయడానికి కూడా వెనుకాడని మాఫియా బానిసలవుతోంది యువతరం.  ప్రస్తుతం సారాయి అమ్మకాలద్వార ఖజానాను సమృద్దిగా పెంచుకోవడానికి ప్రభుత్వం కూడా ఈ పబ్ లను  చూసీ చూడకుండా వదిలేస్తున్డటం మన ఖర్మ. డబ్బులోస్తాయంటే రేపు ప్రభుత్వమూ మాదకద్రవ్యాలు సప్లై చేసేస్తుందేమో. వీటి బారిన పిల్లలు పడకూడదంటే  ఏమి చేయాలి ? మన  పిల్లలకు సరైన మార్గం మనమే చూపించాలి. మత్తు చిన్నదైనా తప్పే నని చెప్పాలి. పెద్దలు కూడా మత్తు జోలికి వెళ్ళడం మానేయాలి. ఇది బీరేగా పర్లేదనో, ఏముంది ఎప్పుడో పార్టీలలో తప్పితే నాకు అస్సలు అలవాటులేదనో చెప్పి తప్పించుకోవడం తగని పని. పిల్లలకు ఉన్న సమస్యలేమిటో కనుక్కొంటూ, వారి తో ప్రతి రోజూ కొంత సమయం గడపటం అలవాటు చేసుకోవాలి. కుటుంబమంతా మత్త్లులేని సంబరాలను జరుపుకొంటూ, ఆనంద క్షణాలను పెంచుకోంటుంటే అసలు మత్తు అవసరమే పిల్లలకు కనిపించదు.   పిల్లల ప్రవర్తన ఎలా ఉంటోంది ? అకస్మాత్తుగా చికాకు పడటమూ, తడబడటమూ  , నిద్రలేమి తో ఉండటమూ, సరిగా తిండి తినకపోవడమూ,  అబద్దాలు చెప్పడమూ, ఇంటిలో వస్తువులు పోతూ ఉండటమూ, పిల్లలు ఎక్కువగా బాత్రూమ్లోనో, బెడ్రూమ్లోనో తలుపులు బిగించుకొని ఎక్కువసేపు ఉంటుండటమూ  జరుగుతుంటే  గమనించి వెంటనే మేల్కొని వారిని  నిపుణులైన, డాక్తర్లవద్దకో కౌన్సిలర్ల వద్దకో తీసుకువెళ్ళి వారిని సరైన దారిలోనికి మళ్ళించడానికి ప్రయత్నించాలే తప్ప, పిల్లలను తిట్టడమూ కొట్టడమూ చేసి వారు ఇంకా మత్తులోకి వెళ్ళేట్లు, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా  చెయ్యకూడదు. మనం జాగ్రత్తలు తీసుకోకుంటే రేపు నిర్వీర్యమైన యువతరం దేశాన్ని అంధకారంలోనికి  నెట్టేస్తుంది.
ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది ఇప్పటికైనా మేలుకుందాం. మన పిల్లలను మత్తు బూతానికి చిక్కకుండా చెయ్యడానికి ఏమి చెయ్యాలో అవి ఇంట్లో చెయ్యడమే కాకుండా, ఈ పబ్ కల్చర్ ను నాశనం చెయ్యాలి.  మన గొప్పదనాన్ని చూపడానికి మత్తు, మార్గం కాదని చాటాలి. ప్రభుత్వాన్ని  కూడా ఈ మత్తు బూతాన్ని నియంత్రించేట్లు మనం  బలవంత పెట్టాలి. లేకపోతే మనమూ మనపిల్లలూ మాఫియా జేబులు నింపడానికే పనిచేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త !

చేతులు కాలిపోతున్నాయ్ ఆకులివ్వండి బాబోయ్ !

Friday, 24 September 2010

హమ్మయ్య. ప్రదాని గారు కామన్ వెల్త్ గేమ్స్ కి తయారవడంలో  దశ దిశలా మసక బారుతున్న భారత తేజం వేపు ఆఖరికి దృష్టి మళ్ళించారు. ఫెన్నెల్ వచ్చి కలవాల్సిన అవసరం లేదనీ, ఆటల పోటీని బాగా నడపడానికి మేము తయారుగానే  ఉన్నామనీ ప్రపంచానికి తెలియచేయడానికి పూనుకొని కాల్మాడీని పక్కకు పెట్టేసారు. ఇన్ని రోజులుగా మీడియా తో కలిసి స్వపక్షాలూ, విపక్షాలూ, సాధారణ జనాలూ ఎంత మొత్తుకున్నా,  రోజుకొకటి చొప్పున ఏదో ఒక విపత్తో, వివాదమో, అపనిందో/పచ్చినిజమో ఎదురవుతున్నా,  స్లో మోషన్లో కూడా  చలనం కనిపించనివ్వని  మన్మోహనుడు  కామన్ వెల్త్ సంచాలకుడు ఫెన్నెల్ వచ్చి కలుస్తాను అని ఎక్కడో ఒక్క కూత కూయగానే ఫుల్ స్పీడులో యాక్షను చూపించేశారు. అంతేలెండి పెరటిచెట్టు వైద్యానికి  పనికి రాదన్నట్లుగానే, తోటి వాడి మంచి మాట కూడా వినయోగ్యం కాదని నిర్ణయిన్చేసి ఉంటారు వారు. సుప్రీంకోర్టు గోదాముల్లో ముక్కనిచ్చేబదులు  దాన్యం బీదలకు పంచమంటే కూడా టా..ట్. ఇది  మీ పరిదిలోకి రాని విషయం అని కొట్టి పారేసిన ఘనుడాయన, మిగిలిన వారాయనకొక లెక్కా. అదే ఎ యునైటెడ్ నేషన్సో, ప్రపంచ బ్యాంకో  అని ఉంటే ఈ పాటికి మన ప్రబుత్వ గోదాముల్లో ముక్కిపోతున్న ధాన్యం నిల్వలన్నీ ఖాళీ అయిపోయి ఉండేవి. వీరి ఈ తెలివితేటలూ, ధైర్యం, నాయకురాలిపై వీరికున్న అనుకూలత, విదేశీయుల మాటలపైన ఉన్న వీరి గురి  చూసి ముచ్చట పడిపోయి అందరికన్నా గొప్ప రాజనీతిజ్నుడి బిరుదు ఇచ్చేయాలని నిర్ణయిన్చేసారట. మనలో మనమాట.. కాల్మాడీని ఇన్నాళ్ళూ  పట్టించుకోకుండా వదిలేయడానికి,  వారు వివిధ రూపాలలో కొత్త కొత్త పద్దతులలో దోచి ఇస్తున్న కోట్లు కారణమా ? లేకపోతే  క్రీడాగ్రామం, స్టేడియాలూ, వాటికి సంబందించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారీలలో   ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూన్న దోపిడీలకితను తెరలా ఉపయోగపడుతున్నాడనే  దిలాసా కారణమా ? లేకపోతే ఎలాగూ ఇంకా విపత్తులోస్తాయి ఇప్పుడే తీసేస్తే, మళ్ళీ ఇంకో విపత్తో, వివాదమో ఎదురైతే మళ్ళీ, మళ్ళీ ఇంకెవరినైనా తీయాల్సి వస్తుందనే ముందుచూపా ? ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది ఈ ప్రహసనం. పేరు పొందిన విదేశీ క్రీడాకారులు మేము పోమని అంటూ ఉంటే , కొన్ని దేశాలు వాళ్ళ వాళ్ళ జట్లను పంపాలో వద్దో అని బుర్రలు బద్దలు కొట్టుకున్టూంటే, ఆల్రెడీ వచ్చిన నూజిలాండ్ జట్లు పాపం వాళ్ళ గదులు, బాత్రూమ్లూ వాళ్ళే తుడుచుకొంటూంటే,  మసిబారిన భారత కీర్తి ఇంకా నల్లనవుతుందో, లేకపోతే అన్నీ సరిగా జరిగి మళ్ళీ పసిడి వెలుగులు వెలుగుతుందో  వేచిచూద్దాం. డబ్బూ పోయే శనిబట్టే  అన్నట్లు ఇన్ని కోట్ల రూపాయలు ఇలా ఇప్పటికే అభివృద్ధి చెందిన రాజధాని నగరంలో ఖర్చు పెట్టీ ఫలితం దక్కనట్లు అవుతోందే. ఇంతకన్నా జిల్లాకి ఒకటో, రాష్ట్రానికి ఒకటో చిన్న ఊరుని తీసుకుని అభివృద్ధి చేసి ఉంటే ఎంత బావుండేది !    ఏది జరిగినా మన మంచికే అన్నట్లు ఇప్పటికైనా మనకు బుద్ధి వస్తే మంచిదే.

కష్టాలు మీకే ఉన్నాయా ?

Thursday, 23 September 2010


మనమంతా కష్టాలన్నీ మనకే ఉన్నాయనుకుని చింతలు పడుతూ లేని కష్టాలను ఊహిస్తూ సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాల పాలు చేసుకుంటుంటాం. అస్సలు కష్టాలే లేకుండా బతకాలంటే ఎంత బోరో కదా? కష్టాలలో నుంచి బయటపడ్డ జీవి సనపెట్టిన వజ్రం లా తయారవుతాడు. కష్టాలను గురించి భయపడకుండా మనం ఏర్పరుచుకున్న దారిలో చేరుకోవాల్సిన మజిలీని చేరుకోవడమే జీవితం.  ఏమంటారు ?

నా ఊహలలో పిల్లలు !

పిల్లలు ఇలా అనుకుంటారేమోనని ఊహించి రాసిన కామెంట్లు అవి. మీకు నచ్చుతాయనే ఆశిస్తాను ! చివరిది మటుకు రక్త సంభందం లోని పాట. సరదాగా చేసిన ప్రయత్నమే ఇది. ఎలా ఉందొ చెబుతారు కదూ ?

జై భారత్ ! శాంతి వర్ధిల్లాలి !

రేపు  రాబోతున్న  మన దేశ ప్రజలందరికీ ఎంతో ముఖ్యమైన బాబ్రి మసీద్ / రామజన్మ భూమి కోర్టు తీర్పు కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీన్ని సాకుగా చేసుకొని కొందరు విద్రోహులూ, దేశ ద్రోహులూ  మన మధ్య పుల్లలు పెట్టి హింసాత్మక సంఘటనల  ద్వారా  విద్వంసం సృష్టించాలనే ప్రయత్నం చేయోచ్చు అనేది మనందరికీ తెలిసిందే. ప్రతిసారీ అలా జరగడం చూస్తూనే ఉన్నాం. ఒక న్యాయస్థానంలో వచ్చే తీర్పు నచ్చినా, నచ్చకపోయినా దానిని తెలియచేయడంలో అనవసరమైన రభస, అల్లరి చేయడం అనాగరికం అని తెలిసినా, కొందరి  ఉన్మాద మూక ప్రోత్సాహాలతో మనందరం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మనం మన వంతుగా ఎటువంటి వదంతులనూ నమ్మడం కానీ, పుట్టించడం కానీ చేయకుండా మన విజ్ఞతను చూబిద్దాం.  రంజాన్ మాసం మొదలైన దగ్గరి నుంచీ  ఈ రోజు ఉదయం వరకూ జరిగిన వినాయక నిమజ్జనం వరకూ మనం చూపించిన  సంయమానికీ, సర్వ మానవ సౌబ్రాత్రుత్వానికి  ఎటువంటి విఘాతం కలగకుండా కాపాడుకుందాం  . ఈదేశం మనది దీన్ని మనమే శాంతియుతంగా  ఉంచుకోవాలి. మనం ఇతరుల భావాలను దెబ్బదీయకుండా, వారి భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా, ప్రవర్తించడాన్ని ఇంకా ఇంకా సాగించాలి, ఎన్నో ఏళ్లుగా  మనదయిన శాంతి కాముకత అనే ఆస్తిని దొంగిలించడానికి ప్రయత్నించే వారి బారిని పడకుండా మనను మనమే కాపాడుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒక పనికిమాలిన మాట అని తరువాత నాలిక కరుచుకొనే చిదంబరం చెప్పాడనో, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకూ కొన్ని పరిమితులు ఉండాలని   భావించే మన్మోహన్ చెప్పాడనో  కాక మన రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని మనం సంయమనం పాటిద్దాం. ఎన్నో  మతాలూ  జాతుల కలయిక మనదైనా మన  జాతి భారతజాతి అనీ దీన్ని ముక్కలు చేయడం ఎవరితరమూ కాదనీ మళ్ళీ ప్రపంచానికి చాటిద్దాం.
జై భారత్ ! శాంతి వర్ధిల్లాలి !

ఏం చేస్తున్నాం ?

Tuesday, 21 September 2010

అవసరం లేకపోయినా పావలా వడ్డీకే రుణాలని ఇచ్చి వాడుకున్నాక కట్టేదారిలేకపోతే ఏం చేస్తున్నాం ?
ఇల్లు కట్టిస్తాం అని చెప్పి ఆశలు కల్పించి మొండిగోడల పైన అప్పనే, కప్పేసి వదిలితే ఏం చేస్తున్నాం ?
వచ్చిన ఎరువంతా బామ్మర్దికిచ్చేసి ఆయన బ్రేవుమని త్రేన్చినాక మీకివ్వడానికి ఒక్క బస్తాకూడా లేదంటే ఏం చేస్తున్నాం ?
పనికిరాని మొలవని విత్తనాలు అంటగట్టి, ఏదోలా పండిస్తే ఒక పదిరూపాయలు మద్దతుధర పెంచేసి దానిపెరుచేప్పి అన్నింటి ధరలూ పెంచేసి వెయ్యి రూపాయలు నొక్కేస్తే ఏం చేస్తున్నాం ?
ధరలు పెరిగితే ధాన్యం విడుదల జేసి ధరలు తగ్గించ గలిగినా, అలా చేయకుండా ధరలను చుక్కలకంటించి ధాన్యం ముక్కి పోనిస్తోంటే ఏం చేస్తున్నాం ?
పచ్చని పోలాలనన్నిటినీ సెజ్ ల పేరుతో లాక్కొని, నచ్చిన వాళ్లకి రాసిచ్చేస్తే ఏం చేస్తున్నాం ?
ఖనిజ సంపదనంతా దోచుకోవడానికి భందువులకు హక్కులిస్తే ఏం చేస్తున్నాం ?
మొదలవని ప్రాజెక్టులకే కోట్లు కోట్లు నొక్కేస్తే ఏం చేస్తున్నాం ?
ఇంటి పన్ను కట్టడానికి మేము మీకు నోటీసులు ఇవ్వకపోయినా పెనాల్టీ మటుకు మీకే అంటే ఏం చేస్తున్నాం ?
చుట్టూ మురుగు పేరుకుంటున్నా మేము తీయట్లేదని దసరా మామూలు ఇవ్వకపోతే వేరే వాళ్ళ చెత్త తెచ్చి మీ ఇంటి ముందు పోస్తాం అంటే ఏం చేస్తున్నాం ?
టాక్స్ రేట్లు విపరీతంగా పెంచినాక గూడా వానల్లో రోడ్డు నదిని తలిపిస్తున్నా, వానలు లేనపుడు గతుకులు ఉయ్యాలలూగిస్తున్నా మమ్మల్ని అడక్కండి మా దగ్గర డబ్బులేదు అంటే ఏం చేస్తున్నాం ?
వారానికి రెండుసార్లు ఏదో ఒక పేరు చెప్పి ఎవడో ఒకడు బంద్ ప్రకటించి రాళ్ళేస్తోంటే ఏం చేస్తున్నాం ?
ప్రభుత్వ ఆఫీసులలో పని చేయడానికి జీతం తీసుకొంటూ, కాగితం కదిలించడానికి లంచమడిగితే ఏం చేస్తున్నాం ?
డబ్బులిస్తే చాలు టేర్రరిస్తులకైనా పాసుపోర్టులిచ్చేస్తే ఏం చేస్తున్నాం ?
పనిచేసుకు బతకడానికి బద్దకమేసి, మన పిల్లలను ఎత్తుకుపోయి, చెమటోడ్చి కూడపెట్టిన మన సొత్తు అడుగుతోంటే ఏం చేస్తున్నాం ?
ఏం చేస్తున్నాం ? ఏం చేస్తున్నాం ?
ఇంకా అనుమానమా ?
బతికేస్తోన్నాం..
గజ్జికుక్కల్లాగా,
గుంటనక్కల్లాగా,
పందికొక్కుల్లాగా,
కలుపుమొక్కల్లాగా,
ఊసరవెల్లుల్లాగా.....................................................................................

పడి ఉంటోన్నాం...
రాళ్ళగుట్టల్లాగా,
పెంటకుప్పల్లాగా,
మురికినాలాల్లాగా,
పాయిఖానాల్లాగా.................................................................................

ద్రవ్యోల్బణం తగ్గిపోతోందోచ్

Friday, 17 September 2010

  ఎటు చూసినా ధరలు చుక్కలనంటుతోంటే, ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుంది?  వీడికెమైనా  పిచ్చా  ? అనుకోకండి. నిజమా అంటే నిజంగా నిజం కాదులెండి. నింగిని దాటి ఎగిరెగిరి పోతున్న ధరలను  తగ్గించడానికి ఉపాయాలు ఎలాగూ తట్టడం లేదు. కనీసం ద్రవ్యోల్బణం రేటును తగ్గించి చూపించినా ప్రజలు సంతోషిస్తారేమోననే ఉద్దేశ్యంతో మన ప్రియతమ ప్రధాని సోనియాగారి దగ్గర అనుమతి తీసుకొని ( లేకపోతె ఇంకేమైనా ఉందా?) ప్రకటించిన కొత్త  పద్దతి. అంటే నిజంగా ధరలు తగ్గకపోయినా తగ్గినట్లు ఎలా కనిపిస్తుంది ? చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్లు పెట్టుకు కనిపిస్తున్నామా ? అని తిట్టేయడానికి తయారు కాకండి. మన పెద్దలు చెప్పేవారు కదా పెద్ద గీతను చిన్నది చేయాలంటే దాన్ని చెరపకుండా ప్రక్కన పెద్దగీత పెడితే చిన్నదైపోతుందని . మన అదృష్టం ఈ చిట్కా ఆయనకు తట్టలేదు లేకపోతె ఇంకేమైనా పెద్ద ఆపద మన నెత్తిన పడేది.అంటే అది నిజంగా తగ్గకపోయినా చిట్కాతో తగ్గించినట్లే, ఈ కొత్త ఒక్క అయిడియా తో మన జీవితాలు మార్చేస్తున్నారాయన. జగన్ యాత్రలా ఈ సోది సాగిస్తూనే ఉంటావా లేకపోతె పాయింటుకి  వస్తావా ? అని చిరాకు పడిపోకండి మరి. పాయింటు కి వచ్చి చెప్పేస్తున్నా.
ద్రవ్యోల్బణం లెక్కించడానికి వాడే ధరల మూల సంవత్సరం (బేస్ ఇయర్ ) ఇప్పటి వరకూ 1993 -94. ఇకనుంచీ వాడబోయే మూల సంవత్సరం 2004 .అంటే ఈ లోపు పెరిగిన/అప్పటి వరకూ ఉన్న ద్రవ్యోల్బణం ఎఫ్ఫెక్ట్  ఇప్పుడు లేక్కవేసే దానిలో ఇంక కనిపించదన్నమాట. వాళ్ళు చెప్పే కారణాలు అప్పటికన్నా ఇప్పుడు బాగా కొత్త కొత్త సరుకులు చేరాయి కాబట్టి వాటి కి మూల సంవత్సరం లో ధరలు లేవని. మనం నమ్మాలని అనుకుంటే అదికూడా నమ్మేద్దాం  లెండి. కానీ అస్సలు ముఖ్యోద్దేశ్యం   మాత్రం ఇది. అంటే చిన్నప్పుడెప్పుడో చూసిన వాణ్ని ఇప్పుడు అకస్మాత్తుగా చూస్తే ఎంతో పెద్దయినట్లు తెలుస్తుంది, అదే మొన్నీమధ్య  చూసినవాడిని మళ్ళీ చూస్తే పెద్ద తేడా కనపడదు. అదన్నమాట మన ప్రధానిగారి కొత్త మన్మోహనాస్త్రం. ఎంతయినా ఆర్ధిక శాస్త్రవేత్త కదా స్టాటిస్టిక్స్ ద్వారా తిమ్మిని బమ్మిని చేయవచ్చు అని తెలియకుండా ఉంటుందా?
ఇంకేం మనకు ద్రవ్యల్బణం తగ్గిపోతుందోచ్.

తల్లులు మారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇదెలా సాధ్యం ?

Wednesday, 15 September 2010

 ఆ మధ్య మన రాష్ట్రం లోనే ఒకామె తాను వివాహేతర సంభందంలో కన్నతన బిడ్డను దైవాంశ సంభూతురాలుగా చూపించడం కోసం తాను ఆ బిడ్డను చేరతీసాను అని చెప్పుకుంది. కొన్నాళ్ళ క్రితం ఇంకో ఆమె తను చెప్పిన మాట వినట్లేదని తన బిడ్డను కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి చంపింది. అదేదో దేశంలో ఒకామె కొన్ని నెలలుగా  ఆగకుండా ఆన్లైన్ గేం ఆడటం కోసం, పిల్లలకు ఫ్రిజ్ లో ఉన్న చెత్తనే పెడుతూ మాడ్చింది. ఇప్పుడింకో ఆమె  తన అక్రమ సంభందానికి అడ్డు వస్తోందని నాలుగేళ్ల కూనను వాతలు పెట్టి హింసించింది. భర్త నుంచి విడిపోయినప్పుడే పోనీ అతనికే ఇస్తే పెంచుకునే వాడేమో? అనాథాశ్రమం  లో చేర్చడానికి తన పరువు అడ్డువచ్చిందేమో ఆ రాక్షసికి. ఇంతకన్నా రోడ్డు మీద వదిలి వేసిన తల్లులే మానవత్వం కొంత ఉన్నవాళ్ళు అనిపిస్తోంది. స్వార్ధం పెచ్చు మీరిపోయి, రక్తం పంచి, ప్రేగు తెంచి కన్న బిడ్డను చిత్ర హింసల పాలు చేస్తున్న, ఇలాంటి ఉపాధ్యాయురాలిని చూస్తోంటే కలియుగాంతానికి ఎంతో దూరం లేదేమో అనిపిస్తోంది. చెట్లకు కాయలు భారమైనట్లు ఉందికదా మరి.

చిరంజీవిగారి గుర్రం/మోటార్ సైకిల్ స్వారీవస్తోంది తప్పుకోండి.. తప్పుకోండి..

నిన్న ఏదో న్యూస్ చానల్ లో చిరంజీవిగారి ఇదివరకు ఎప్పుడో చేసిన యాత్రలో గుర్రం మీద స్వారీ చేసిన వీడియో చూసాను. ఇవ్వాళ పేపర్ లో ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ కనిపించారు. ఆయన ఒక మెగాస్టార్ మాత్రమె కాక స్వంతగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి, అనుకున్న విధంగా ప్రభుత్వాన్ని ఏర్పరచలేక పోయినా. కొన్ని వోట్లు  చీల్చడం ద్వారా, తెలుగు దేశానికి చెక్ పెట్టడంలో కాంగ్రెస్ కు సాయపడి, ఇంకా జగన్ వ్యవహారం ముదిరి కాంగ్రెస్ కు  ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా నేను రెడీ అని రోశయ్యగారికి హామీ ఇచ్చి, సోనియాకు కూడా ఇంటికెళ్ళి చెప్పి వచ్చిన రాజకీయ నాయకుడు . ఆయనకు తన పాపులారిటీని ప్రదర్శించుకోవాలని అనిపించడం కూడా సహజమే. అస్సలే ఒక ప్రక్కన జగన్ గారి ఓ..............................దార్పు యాత్ర, జీడి పాకం లాగా సా...గుతోంటే, చంద్ర బాబు కూడా, మహారాష్ట్రలో తిట్టించుకొని, జైలు లో పెట్టించుకొని, నాంపల్లి పోలీసు స్టేషన్ లో వానలో కూర్చొని, కోస్గీలో రాళ్ళు వేయించుకొని ఏదో విధంగా హడావిడిగా కనిపిస్తూ ఉన్నారాయే. ఏదో తమ్ముడితో తెలంగాణా యాసలో ప్రసంగాలు చేయించి, పులి కి ముందు ఇంకో పేరు పెట్టి, కళాకారులకు ప్రాంతీయభావాలు ఉండవని చెబుదామని ప్రయత్నిస్తే, అది కాస్తా అతి పబ్లిసిటీ తో తుస్సు మనే. అందుకని జనంలోకి వెళ్లి జనంతో కలిసి నేనున్నానూ అనిపించుకోక పొతే జనం మరచి పోతారేమోనని బెంగ కదా? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటీ అంటే. అయ్యా మీరు పబ్లిసిటీ చేయించుకోవడానికి ఉన్న అన్ని దారులూ వాడుకోండి. కానీ మీ వెంట ఉండే సెక్యూరిటీ వారి గురించి, అభిమానుల గురించి కొద్దిగా ఒక నిముషం ఆగి ఆలోచించి చూడండి. మీ మెగాస్టార్ ఇమేజ్ కి జామ్మంటూ వెళ్ళిపోవడం తగిందే కానీ. పాపం జీతపురాళ్ళ కోసం, మీ దర్శనభాగ్యం కోసం, మీ పార్టీలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం మీ వెంట ఉండే సెక్యూరిటీ వాళ్ళు, అభిమానులూ, పార్టీ కేడర్ గురించి పట్టించుకున్నారా? మిమ్మల్ని అంటి ఉన్న మీ సెక్యూరిటీ వాళ్ళు మీకు ఇబ్బంది కలగా కుండా ఉండటం కోసం మీవెంట పరిగెత్తాల్సి వచ్చే విధంగా ప్రవర్తించడం మీకు భావ్యమా? కొద్దిగా  సమాజంలో ఉన్న ఇతరుల గురించి కూడా  ఆలోచించడం మంచిదేమో చిరంజీవిగారూ.
 

బక్కెట్లో నిమజ్జనం

Tuesday, 14 September 2010

మొన్న ఈనాడు పేపర్ చూస్తుంటే రెండు ఫోటోలు కనిపించాయి. ఒక దానిలో ఒక యువకుడు తన మిత్రునికోసం గణపతి ప్రతిమ తీసుకు వెళ్తున్నాడు. ఇంకోదానిలో  బురఖాలో ఉన్న ఒక ముస్లిం యువతి, ఇంకో హిందూ యువతితో కలిసి గణపతి ప్రతిమను కొంటోంది. మిగిలిన ఫోటోలలో  రాజకీయనాయకులూ, ఇతరులూ తమ తమ పలుకుబడి పెంచుకునేందుకు సర్వ మత సామరస్యం చూపించినా, ఈ రెండు ఫోటోలూ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. మన మీడియా కూడా పనికిరాని, ఇతరులకు ఇబ్బంది కలిగించే, హింస, లేదా ఫాషన్ పేరుతొ బూతు చూబించే బదులు ఇలాంటి చిత్రాలను ప్రచురించడం లేదా టీవీ లలో చూబించడం చేస్తే మంచితనం పెరుగుతుందని నా నమ్మకం.

నిన్న మా ఇంటి బుల్లి మట్టి గణపతిని నిమజ్జనం చేద్దాం కదా అని హుస్సేన్ సాగర్ కి వెళ్లి చూస్తే అంతటా దుర్ఘంద బూయిష్టంగా, నల్లగా ఉన్న సాగర్ ను చూసి ఏడుపొచ్చినంత పనయ్యింది. ఈ కాలుష్యానికి ఏవిధమైన సంభందం ఉన్నట్లు పాపం జీ.హెచ్.ఎం.సి. వారు ఎలాగూ ఒప్పుకోరు. రోడ్డ్లు గతుకుల స్థాయి దాటి, ఎత్తుపల్లాలతో కొండలూ లోయలను తలిపిస్తున్నా లేశమాత్రం అయినా  సిగ్గు పడని వారు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయగలరని ఎలా నమ్మడం.  చుట్టూ చూస్తే తోలి రోజుల్లో కాలనీలలోని మండపాలలో పెట్టే సైజులలో ఒక్కొక్క కుటుంబం తెస్తున్న గణనాధుని ప్రతిమలను చూసి ఆశ్చర్యం వేసింది. ఎంత పెద్ద గణపతిని ఇంట్లో పెడితే అంత గొప్ప కామోసు. అందరూ గ్రీన్ గణేశ, గ్రీన్ గణేశ అని గోల చేస్తుంటే ఏమీ పట్టకుండా పలు రంగులలో ప్లాస్టర్ అఫ్ పారిస్ తో చేసిన ప్రతిమలను తెచ్చి భక్తీ శ్రద్ధలతో నిమజ్జనం చేసి మురుగు పెంచడానికి యితోధిక సాయం చేస్తున్నది చూసి తట్టుకోవడం కష్టమయ్యింది. ఇంతకూ ముందు ఒక అంతర్జాల మిత్రురాలు చెప్పిన చిట్కా గుర్తు వచ్చింది. అది బక్కెట్లో నిమజ్జనం.  ఆమె చెప్పేవారు నాకు ఇలా చెరువులను ద్వంసం చెయ్యడం ఇష్టం ఉండదు. నేను నా గణపతిని బక్కెట్లో నిమజ్జనం చేసి, తరువాత ఆనీటిని తులసికోటకు పోస్తాను అని. నేను కూడా నిశ్చయిన్చేసుకున్నాను. ఇంక నుంచి ప్రతి సంవత్సరం బక్కెట్లోనే నిమజ్జనమే చేస్తాను. కాకపొతే కొత్త అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా మొక్కలు పెట్టలేదు. మంచి పూలమొక్కలు తెచ్చి పెట్టబోతున్నాం. వాటికే గణపతిని నిమజ్జనం చేసిన నీరు పోసి, నా వంతు సాయం హుస్సేన్సాగర్ కి చేద్దాం అనుకుంటున్నాను.  మీరేమంటారు?

పిల్లల చదువులు

Friday, 10 September 2010

పట్టబద్రులు కావాలంటే పిల్లలు..
బట్టీలు కొట్టాలి కోకొల్లలు !
అమ్ముకోవాలి ఆస్తీ, ఇల్లులు..
అమ్ముడవ్వాలి తండ్రీ, తల్లులు !

కంచం - లంచం !

Thursday, 9 September 2010

ప్రతి మనిషికీ కావలిసింది..
మెతుకులు కంచంలో !
మరి ఎందుకు కనిపిస్తోంది..
బతుకులు లంచంలో ?

దేవుడి నగలు !

చిక్కుల్లో ఉన్నప్పుడు మనకు...
దేముడే దిక్కు !
రాయలు నగలు పోయిన...
దేవునికి ఏది దిక్కు ?

లంచం - మంచం !

దిక్కులెంచని నాయకత్వం..
లంచం మెక్కింది !
దిక్కు తోచని బీదరికం...
మంచం ఎక్కింది !

నీళ్ళు - బాటిళ్ళు !

గొంతు తడిపేందుకు
లేవు గుక్కెడు నీళ్ళు..
గూడు కూల్చేందుకు
సిద్ధం బాటిళ్ళు..