రోడ్డెక్కిన పులులూ - మునుగుతున్న నగరాలూ

Tuesday 28 September 2010

మొన్నీ మధ్య బీహార్లో కొన్ని ఏనుగులు సమూహంగా గూడ్స్ బండి డీ కొట్టడం వల్ల  రైలు పట్టాల మీద మరణించాయి. అయితే అది అభయారణ్యం కాబట్టి రైళ్ళు నడిపే వారు చూసుకు నడప వలిసిన బాధ్యత ఉంది.
ఆ మధ్య హైదరాబాద్లో కూడా ఒక చిరుత తిరిగింది. అలాగే  తిరుమలలో చిరుతలు దాడి చేసాయనీ, ఇంకెక్కడో  ఇళ్ళమీదికి ఎలుగు బంట్లు వచ్చాయనీ, వాళ్ళ హాస్టల్ లోకి వచ్చిన ఒక 10 అడుగుల కొండచిలువని ఆడపిల్లలు కలిసి చంపెసారానీ విన్నాం.  ఘనత వహించిన కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్ లో కూడా పాములు వచ్చాయని విన్నాం. ఈ జంతువులన్నీ ఇలా ఊళ్ళ మీదికి ఎందుకొస్తున్నాయి అంటారూ ? నాగరికతకు దూరంగా ఉండవలిసిన వన్యప్రాణులు రోడ్లమీద సంచరించడం ప్రమాద ఘంటికలు మ్రోగించడం లేదా ? వాటికి అరణ్యంలో భద్రతా, ఆహారం కరువైపోయాయని తెలియడం లేదా?
ఇదివరకు వానాకాలం వస్తోందీ అంటే ఒక సుందరమైన అనుభూతి కలిగేది. వానా వానా వల్లప్పా అంటూ వానలో తిరిగే  పిల్లలూ, కాగితం పడవలు చేసిస్తే వాటిని పారుతున్న వాననీటిలో వదిలి, అవి మునిగేంతవరకూ వెంట పరిగెత్తే పిల్లలూ, ఆకాశంలో అబ్బురంగా ఏర్పడే ఇంద్రధనుస్సులూ, వేడి వేడి  మిరపకాయ బజ్జీలూ, పకోడీలూ తింటూ వాన చినుకుల సరిగమలు వింటూ గడిపిన క్షణాలూ, కనీసం ఒక్కసారైనా వానలో తడవాలని పడ్డ తపనలూ  గుర్తుకు తెచ్చుకొని సరదా పడేవాళ్ళం. ఇప్పుడేమో  వానొస్తోందంటే గుండె గతుక్కు మంటోంది. రోడ్డు ఎక్కాలంటే  పడవ ప్రయాణాలు  చెయ్యాల్సిన పరిస్తితులు, సెల్లారులలోకి ఇళ్ళలోకి వచ్చి వెళ్ళని వరద నీరు, కొండలను లోయలను గుర్తుకు తెచ్చి, నడుము విరగకొట్టే రోడ్లు, తెరిచి ఉంది సుడిగుండంలా  మింగేసే మాన్ హోల్లు, పెరిగిపోయే మురుగూ, ముంచుకొచ్చే జ్వరాలూ గుర్తొచ్చి ఇల్లు కదలబుద్దే కాదు.
 వాతావరణం లో ప్రతి సంవత్సరం వస్తోన్న మార్పులూ మన ప్రస్తుత జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలన్నది సూచించడం లేదా ? ప్రకృతిని సరిగా అర్ధం చేసుకోకుండానే ప్రకృతితో ప్రయోగాలు చేసి,  నదుల దారులు మళ్ళించి పుడమి జీవన సమ తుల్యాన్ని అస్తవ్యస్తం చేయడానికి మనకు ఎవరిచ్చారు హక్కు ? పర్యావరణాన్ని విషతుల్యం చేస్తూ, పచ్చదనం పరిశుభ్రం అని ఒక పక్క అంటూ ఇంకో వైపు  పచ్చని చేలనూ, అడవులనూ నాశనం చేస్తూ తరిగిపోతున్న సేద్యంతో, పెరిగిపోతున్న జనాభాకు తిండి ఎలా పెడదాం అనుకుంటున్నారు ? తగ్గిపోతున్న అడవినీడతో మరి వన్య ప్రాణులు ఎక్కడికి  పోతాయి ? కనిపించిన దాన్ని కనిపించినట్లు చంపుకుంటూ పొతే రేపు ఆ ప్రాణులను కూడా అవతార్ సినిమాలో లాగా  కృత్రిమంగా సృష్టించి చూపితే అవి ఒకప్పుడు ఉండేవి అంటే నమ్మలేని స్తితి కూడా ఎంతో దూరంలో లేదు. 2012 లో ప్రళయం వస్తుందో లేదో తెలీదు కానీ, సమతుల్యం చెడిన భూమి, ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన ఆకాశ హార్మ్యాలూ, భవనాలూ, ప్రాజెక్టులూ, మనం ఏమైపోతామో ఆలోచించండి.

2 comments:

రహ్మానుద్దీన్ షేక్ said...

ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉంటే బావుండు

Khammam said...

Touch Chesaaru

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )