చేతులు కాలిపోతున్నాయ్ ఆకులివ్వండి బాబోయ్ !

Friday, 24 September 2010

హమ్మయ్య. ప్రదాని గారు కామన్ వెల్త్ గేమ్స్ కి తయారవడంలో  దశ దిశలా మసక బారుతున్న భారత తేజం వేపు ఆఖరికి దృష్టి మళ్ళించారు. ఫెన్నెల్ వచ్చి కలవాల్సిన అవసరం లేదనీ, ఆటల పోటీని బాగా నడపడానికి మేము తయారుగానే  ఉన్నామనీ ప్రపంచానికి తెలియచేయడానికి పూనుకొని కాల్మాడీని పక్కకు పెట్టేసారు. ఇన్ని రోజులుగా మీడియా తో కలిసి స్వపక్షాలూ, విపక్షాలూ, సాధారణ జనాలూ ఎంత మొత్తుకున్నా,  రోజుకొకటి చొప్పున ఏదో ఒక విపత్తో, వివాదమో, అపనిందో/పచ్చినిజమో ఎదురవుతున్నా,  స్లో మోషన్లో కూడా  చలనం కనిపించనివ్వని  మన్మోహనుడు  కామన్ వెల్త్ సంచాలకుడు ఫెన్నెల్ వచ్చి కలుస్తాను అని ఎక్కడో ఒక్క కూత కూయగానే ఫుల్ స్పీడులో యాక్షను చూపించేశారు. అంతేలెండి పెరటిచెట్టు వైద్యానికి  పనికి రాదన్నట్లుగానే, తోటి వాడి మంచి మాట కూడా వినయోగ్యం కాదని నిర్ణయిన్చేసి ఉంటారు వారు. సుప్రీంకోర్టు గోదాముల్లో ముక్కనిచ్చేబదులు  దాన్యం బీదలకు పంచమంటే కూడా టా..ట్. ఇది  మీ పరిదిలోకి రాని విషయం అని కొట్టి పారేసిన ఘనుడాయన, మిగిలిన వారాయనకొక లెక్కా. అదే ఎ యునైటెడ్ నేషన్సో, ప్రపంచ బ్యాంకో  అని ఉంటే ఈ పాటికి మన ప్రబుత్వ గోదాముల్లో ముక్కిపోతున్న ధాన్యం నిల్వలన్నీ ఖాళీ అయిపోయి ఉండేవి. వీరి ఈ తెలివితేటలూ, ధైర్యం, నాయకురాలిపై వీరికున్న అనుకూలత, విదేశీయుల మాటలపైన ఉన్న వీరి గురి  చూసి ముచ్చట పడిపోయి అందరికన్నా గొప్ప రాజనీతిజ్నుడి బిరుదు ఇచ్చేయాలని నిర్ణయిన్చేసారట. మనలో మనమాట.. కాల్మాడీని ఇన్నాళ్ళూ  పట్టించుకోకుండా వదిలేయడానికి,  వారు వివిధ రూపాలలో కొత్త కొత్త పద్దతులలో దోచి ఇస్తున్న కోట్లు కారణమా ? లేకపోతే  క్రీడాగ్రామం, స్టేడియాలూ, వాటికి సంబందించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారీలలో   ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూన్న దోపిడీలకితను తెరలా ఉపయోగపడుతున్నాడనే  దిలాసా కారణమా ? లేకపోతే ఎలాగూ ఇంకా విపత్తులోస్తాయి ఇప్పుడే తీసేస్తే, మళ్ళీ ఇంకో విపత్తో, వివాదమో ఎదురైతే మళ్ళీ, మళ్ళీ ఇంకెవరినైనా తీయాల్సి వస్తుందనే ముందుచూపా ? ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది ఈ ప్రహసనం. పేరు పొందిన విదేశీ క్రీడాకారులు మేము పోమని అంటూ ఉంటే , కొన్ని దేశాలు వాళ్ళ వాళ్ళ జట్లను పంపాలో వద్దో అని బుర్రలు బద్దలు కొట్టుకున్టూంటే, ఆల్రెడీ వచ్చిన నూజిలాండ్ జట్లు పాపం వాళ్ళ గదులు, బాత్రూమ్లూ వాళ్ళే తుడుచుకొంటూంటే,  మసిబారిన భారత కీర్తి ఇంకా నల్లనవుతుందో, లేకపోతే అన్నీ సరిగా జరిగి మళ్ళీ పసిడి వెలుగులు వెలుగుతుందో  వేచిచూద్దాం. డబ్బూ పోయే శనిబట్టే  అన్నట్లు ఇన్ని కోట్ల రూపాయలు ఇలా ఇప్పటికే అభివృద్ధి చెందిన రాజధాని నగరంలో ఖర్చు పెట్టీ ఫలితం దక్కనట్లు అవుతోందే. ఇంతకన్నా జిల్లాకి ఒకటో, రాష్ట్రానికి ఒకటో చిన్న ఊరుని తీసుకుని అభివృద్ధి చేసి ఉంటే ఎంత బావుండేది !    ఏది జరిగినా మన మంచికే అన్నట్లు ఇప్పటికైనా మనకు బుద్ధి వస్తే మంచిదే.

1 comments:

bonagiri said...

ఆకులు ఎందుకు?

యమునా నది పొంగుతోంది. అందులో పెట్టమనండి చేతులు.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )