యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు భూతం ఊడల మర్రిలా ఇట్లా ఎలా పాతుకుపోయిన్దంటారూ ? ప్రతి తరం లోనూ పెద్దలకూ, పిల్లలకూ ఉన్న జనరేషన్ గాప్ ను తిట్టుకోవడం, పిల్లలు చెడిపోతున్నారని బాధ పడటమూ ఉంది. పూర్వకాలంలోనూ దారితప్పి మత్తుకు బానిసలై తామూ, తమతో పాటు తమవారినీ నరకయాతనలకు గురిచేసుకున్న యువకులుండేవారు. కానీ వాళ్లకు తెలియకుండా వాళ్ళను ఉచ్చులో బిగిస్తూన్న పబ్ కల్చర్ ఇదివరకు లేకపోవడం వల్ల ఈ బూతం ఇంత బలాన్ని పొందలేకపోయింది. మనం పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతాం. వాళ్ళడిగినవీ, అడగనివీ అన్నీ కొనిచ్చి, వాళ్ళ కోసం వాళ్ళు కోరిన, లేక మనం కోరుకున్న మార్గం లో వాళ్ళను నడిపించడం కోసం ప్రయత్నిస్తుంటాం. వాళ్ళు చేరాలని చేరలేకపోయిన ఎత్తులకు వాళ్ళ పిల్లలను చేర్చాలనుకునే, తాము కన్న కలలను తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకొనే తల్లిదండ్రులు ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు. దానికి తగ్గట్టు కొందరు పిల్లలు తల్లి తండ్రులను వారి కోర్కెలు సాధించడం కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటం కూడా చూస్తూనే ఉన్నాం.
పిల్లల కోర్కెలు తీర్చడానికి తమ బడ్జెట్ కు మించినదైనా వెరవక అప్పో సప్పో చేసినా వారడిగిన సెల్లుఫోనో, వీడియో గేమో, మోటార్ సైకిలో, లాప్టాప్ నో కొని, అడిగినంత డబ్బూ ఇచ్చి పిల్లలను సంతృప్తి పరుస్తూన్న తల్లితండ్రులు కూడా పెరిగిపోతున్నారు. పెరిగిన పోటీతత్వం లో తమకు అవసరమైనంత కాక ఇతరులతో సమానంగానో, ఇతరులకన్నా ఎక్కువగానో తాముండాలనీ, తమపిల్లలను ఉంచాలని కొందరు తల్లితండ్రులు పరుగులు తీస్తున్నారు. తమ తమ కోర్కెల సాధనకోసం వారు ఎక్కువ సమయాన్ని ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వినియోగిస్తున్నారు. ఎప్పుడైనా సమయం ఖాళీగా దొరికినా ఆ సమయాన్ని పిల్లలతో మానసికంగా పంచుకోవడం కన్నా తమ తమ గొప్పదనాన్ని ఇతరులకు చాటడంలో వినియోగిస్తున్నారు. ఎవరో పార్టీ ఇచ్చారని వీరివ్వడమూ, ఎవరో డ్రింక్స్ సర్వ్ చేసారని వీళ్ళు సర్వ్ చేయడమూ కూడా చేస్తున్నారు. స్వయంగా తామే పబ్బులకు వెళ్తూ అందులో తప్పులేదనే ఉద్దేశ్యంతో ఉండే తల్లితండ్రులు పెరిగిపోవడంతో, పిల్లలు పబ్ కెళ్తే, కాదనీ లేదా తప్పనీ ఎలా అనగలరు ? అంటే డ్రింక్స్ తీసుకున్న వాళ్ళంతా పాడై పొయారనో, పాపాలు చేసారనో చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. పూర్వం మన తల్లితండ్రుల నియంత్రణ వల్లో, లేకపోతే మన అదృష్టం వల్లో మనకు ప్రస్తుత పరిస్తితుల వంటి పరిస్తితులు లేక మనకు ఈ బూతం బారిన పడటానికి తక్కువ అవకాశాలు ఉండేవి. ఇంక యువతరం లో కూడా విద్య వెంటనే ఎంతో ఎక్కువ జీతాలు ఇస్తూ ఉద్యోగాలు వెతుక్కుంటూ కళాశాలలోనే దొరకుతూ ఉండటం తో, ఖర్చుల పై నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం లేదనే భావం ఎక్కువవుతోంది. ఆలస్యంగా ఇంటికి వెళ్తే ఎందుకాలస్యం అయిందని అడిగేవారు లేకపోవడంతో పబ్ లలోనే తమ ఆనందాల్ని వెతుక్కొంటోంది యువతరం ( అందరూ కాదండీ ). ఇంక పబ్ లలో బీరు, విస్కీ ల మత్తులో తూగుతున్న వారిని మాదకద్రవ్యాల వైపు మళ్లిస్తోంది మాఫియా. వారికి తెలియకుండా వారి గ్లాసుల్లో చేరిన, లేదా వారి సిగరెట్లో కూరిన మాదకద్రవ్యాల నిషాకు నెమ్మది నెమ్మదిగా బానిసలైపోతున్నారు కొందరు పిల్లలు. స్లోగా మాదకద్రవ్యాలు తీసుకోకపోతే గడవని స్తితికి చేరిపోతున్నారు. ఇంక తరువాత వారిపని ఏమిటి ? వాళ్ళు కష్టపడి సంపాయించిన జీతం రాళ్ళను, లేదా తల్లితడ్రుల వద్దనుంచి పొందిన పాకెట్ మనీ ని సమర్పించుకొని, అది సరిపోక ఇంట్లో వాళ్లకు తెలియకుండా చిన్న చిన్న వస్తువులు దొంగిలించడమూ , అమ్మేయడమూ మళ్ళీ మళ్ళీ మత్తులో మునిగి పోవడమూ. అది కూడా అయిపోయిన తరువాత ఇంట్లో వాళ్ళకు విషయం తెలిసినాక, ఇంక నిర్భీతిగా ఇంట్లో వాళ్ళతో పోట్లాడి, కొట్టి చేతికందినవి ఎత్తుకుపోవడమూ, కుదరకపోతే మాఫియా వారు చెప్పిన చిన్న చిన్న క్రయిమ్లూ, అవి దాటినాక పెద్ద పెద్ద క్రయిమ్లూ చేస్తూ చివరికి దేశ ద్రోహం చేయడానికి కూడా వెనుకాడని మాఫియా బానిసలవుతోంది యువతరం. ప్రస్తుతం సారాయి అమ్మకాలద్వార ఖజానాను సమృద్దిగా పెంచుకోవడానికి ప్రభుత్వం కూడా ఈ పబ్ లను చూసీ చూడకుండా వదిలేస్తున్డటం మన ఖర్మ. డబ్బులోస్తాయంటే రేపు ప్రభుత్వమూ మాదకద్రవ్యాలు సప్లై చేసేస్తుందేమో. వీటి బారిన పిల్లలు పడకూడదంటే ఏమి చేయాలి ? మన పిల్లలకు సరైన మార్గం మనమే చూపించాలి. మత్తు చిన్నదైనా తప్పే నని చెప్పాలి. పెద్దలు కూడా మత్తు జోలికి వెళ్ళడం మానేయాలి. ఇది బీరేగా పర్లేదనో, ఏముంది ఎప్పుడో పార్టీలలో తప్పితే నాకు అస్సలు అలవాటులేదనో చెప్పి తప్పించుకోవడం తగని పని. పిల్లలకు ఉన్న సమస్యలేమిటో కనుక్కొంటూ, వారి తో ప్రతి రోజూ కొంత సమయం గడపటం అలవాటు చేసుకోవాలి. కుటుంబమంతా మత్త్లులేని సంబరాలను జరుపుకొంటూ, ఆనంద క్షణాలను పెంచుకోంటుంటే అసలు మత్తు అవసరమే పిల్లలకు కనిపించదు. పిల్లల ప్రవర్తన ఎలా ఉంటోంది ? అకస్మాత్తుగా చికాకు పడటమూ, తడబడటమూ , నిద్రలేమి తో ఉండటమూ, సరిగా తిండి తినకపోవడమూ, అబద్దాలు చెప్పడమూ, ఇంటిలో వస్తువులు పోతూ ఉండటమూ, పిల్లలు ఎక్కువగా బాత్రూమ్లోనో, బెడ్రూమ్లోనో తలుపులు బిగించుకొని ఎక్కువసేపు ఉంటుండటమూ జరుగుతుంటే గమనించి వెంటనే మేల్కొని వారిని నిపుణులైన, డాక్తర్లవద్దకో కౌన్సిలర్ల వద్దకో తీసుకువెళ్ళి వారిని సరైన దారిలోనికి మళ్ళించడానికి ప్రయత్నించాలే తప్ప, పిల్లలను తిట్టడమూ కొట్టడమూ చేసి వారు ఇంకా మత్తులోకి వెళ్ళేట్లు, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చెయ్యకూడదు. మనం జాగ్రత్తలు తీసుకోకుంటే రేపు నిర్వీర్యమైన యువతరం దేశాన్ని అంధకారంలోనికి నెట్టేస్తుంది.
ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది ఇప్పటికైనా మేలుకుందాం. మన పిల్లలను మత్తు బూతానికి చిక్కకుండా చెయ్యడానికి ఏమి చెయ్యాలో అవి ఇంట్లో చెయ్యడమే కాకుండా, ఈ పబ్ కల్చర్ ను నాశనం చెయ్యాలి. మన గొప్పదనాన్ని చూపడానికి మత్తు, మార్గం కాదని చాటాలి. ప్రభుత్వాన్ని కూడా ఈ మత్తు బూతాన్ని నియంత్రించేట్లు మనం బలవంత పెట్టాలి. లేకపోతే మనమూ మనపిల్లలూ మాఫియా జేబులు నింపడానికే పనిచేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త !
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఏంటో మంది తండ్రులు ఇంట్లో కూర్చొని మందు కొడతారు ...స్నేహితలుని పిలిచి ...భార్య కి ఎదినా టిఫిన్ చేయమని చెప్పి బాటిల్ ఓపెన్ చేస్తారు ...పిల్లలు ఎప్పుడు తమ తల్లి దండ్రులనే మొదటి ఉదాహరణ గా తీసుకుంటారు ...మరి అలంటి తల్లి దండ్రులే ఇలా ప్రవర్తిస్తూ ఉంటె?? ఇక తల్లి దండ్రుల దృష్టిలో సమయాన్ని మానసికంగా పంచుకోడం అంటే ...పిల్లలు ఎం చేస్తున్నారో తెలుసుకుని ...ప్రతి విషయం మీద ఒక సలహా పడెయ్యడం ...ఎగరనివ్వకుండా ఎలా ఎగరాలో క్లాసు పీకడం ...
george orwell చెప్పినట్టు "Each generation imagines itself to be more intelligent than the one that went before it, and wiser than the one that comes after it." ....మాదక ద్రవ్యాలు ఇప్పుడు వచ్చినవి కావు ...దేవానంద్ హరే రామ హరే కృష్ణ కాలం నుంచి ఉన్నాయి ...ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు లేవు అనకండి...అప్పుడు ఉన్నాయి...ఇప్పుడు జనాభా పెరిగింది ..కాబట్టి వాడకం కూడా పెరిగింది...ఇప్పటకీ గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ...అస్సలు తాగని వారు ఉన్నారు ...చాల మండే ఉన్నారు ...తేడా ఏంటి అంటే ...అప్పట్లో zoom tv, headlines today, v tv లాంటి పార్టీ channels లేవు ...వార్తా పత్రికలలో page 3 అన్న concept కూడా లేదు, ఎక్కడ మాదకద్రవ్యాలు దొరికినా ఫ్లాష్ న్యూస్ వేసే channels లేవు ...
మీరన్నది అక్షరాలా నిజం సంజీవ్ కుమార్ గారూ,
పిల్లలకు సరైన వాతావరణాన్ని ఏర్పరచాల్సిన బాద్యత తల్లితండ్రులదే. మనం గంజాయి విత్తులు జల్లి తులసి మొక్కలను పెంచలేము కదా ? మన జనం కానీ మీడియా కానీ బాధ్యతలు మరిచి, స్వేచ్చను దురుపయోగపరిచి విచ్చలవిడి తనానికి పొతే జరిగే ఉపద్రవం నుంచి పిల్లల్ని తల్లితండ్రులే కాపాడాలి కదా? వారికి స్నేహితులుగా మారి, వారు ఎన్నుకోవాలనుకుంటున్న దారుల మంచి చెడుల గురించి చర్చించి , వారికి తెలియనివి తెలియజేస్తూ, వీరికి తెలియనివి వారినుంచి తెలుసుకుంటూ, వారి నిర్ణయాలను గౌరవిస్తూ వాటిలో ఒకవేళ ఏమైనా లోపాలుంటే నిర్మొహమాటంగా ఎత్తి చూపి వారిని మంచి మార్గం లో నడపాల్సింది తల్లితండ్రులే.
నిజమే మాదక ద్రవ్యాలు ఎప్పటినుంచో ఉన్నాయి. హరేరామ హరే కృష్ణ సినిమా సమయంలో హిప్పీలు బయట కనిపిస్తూనే ఉండే వాళ్ళు. కానీ కొన్నాళ్ళకు కనిపించడం తగ్గిపోయింది, ఎందుకూ అంటే అప్పుడు వాటి బారిన పడిన ప్రజల శాతం తక్కువ కాబట్టి, ఇంకా ప్రభుత్వాలు త్వరగా స్పందించి నియంత్రణకు చర్యలు తీసుకున్నారు కాబట్టి, అప్పుడు ఇప్పుడున్నంత లెవెల్ లో అవినీతి లేదు కాబట్టి.
ఎస్ సర్ ! మంచి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. లేకపోతే ఏమైపోయేదో మన దేశం. వారి పిల్లలను సరైన దారిలో పెట్టే తల్లితండ్రులు కూడా కోకొల్లలు. కానీ చెడు ఆకర్షించినంతగా, మంచి ఆకర్షించదు కదా. ఈ స్పీడు యుగంలో పెరిగిన ఆకర్షణలకు, పెరిగిన స్వేచ్చతో తప్పటడుగులు వేస్తున్న పిల్లల శాతం పెరిగిపోతోంది. అందుకనే పిల్లలను మాఫియా బానిసలుగా మారనీయకండి అని చెప్పేది.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )