అయితే అప్పారావు మాత్రం ఇప్పుడు పెట్రోలు అక్కడ కొనడం మానేసాడు !

Thursday 17 February 2011

అప్పారావు ఆఫీసుకి వెళ్ళడానికని  బయలుదేరి అపార్ట్మెంట్ కింద సెల్లార్ లో ఉన్న మోటర్ సైకిల్ దగ్గరకు వెళ్తుంటే పక్క ఫ్లాట్లలో ఉన్న మూర్తీ మురళీ కనిపించారు !
" ఏమిటి మూర్తి గారూ చాలా డల్ గా  ఉన్నారు ? " అడిగాడు అప్పారావు !
" ఏం చెప్పమంటారు బాస్ ? ఈ మధ్య మా కారు మైలేజి చాలా తక్కువిస్తోంది ! దానికితోడు నెలకు రెండుసార్లు పెట్రోలు ధర పెరిగిపోతోంది అందుకని బుర్ర వేడెక్కిపోతోంది  " వాపోయాడు మూర్తి !
" అందుకనే బాస్ నేను కారు పక్కన పెట్టేసి మోటర్ సైకిల్ మీదే తిరుగుతున్నా " ఆనందంగా చెప్పాడు అప్పారావు బుర్రు మని మోటర్ సైకిల్ స్టార్ట్ చేస్తూ  !
" అవును గురువుగారూ మేము కూడా అదే చేయాలి అనుకుంటున్నాము " అన్నాడు మురళి !
వాళ్ళిద్దరికీ బై చెప్పి రోడ్డెక్కిన అప్పారావు  స్పీడో మీటర్ వేపు చూసాడు !  పెట్రోలు అయిపోవచ్చినట్లు తెలిసి దగ్గరలోనే రోడ్డు పక్కన సీసాలలో పెట్రోలు అమ్మే వాళ్ల వేపు దారితీశాడు !
" ఖాదిర్ బాయ్ ఒక లీటర్ పెట్రోలు పోస్తావా ? " తన బండి పెట్రోల్ ట్యాంక్ మూత తీస్తూ అడిగాడు అప్పారావు !
" అందుకేగా సాబ్ మేముందీ ? లీటరు చాలా ఇంకా పోయాలా ? " అడిగాడు ఖాదిర్ !
" ఒక లీటర్ చాల్లే భాయ్ ! ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పెట్రోల్ బంకు లో పోయిన్చుకుంటాలే " డబ్బులిస్తూ చెప్పాడు అప్పారావు !
" ఆప్కీ మర్జీ సాబ్, లేకిన్  మేము తెచ్చేది కూడా ఆ పెట్రోలు బంకునించేగా సాబ్  " నవ్వుతూ సలాం చేసాడు ఖాదిర్ భాయ్  !
ఇక్కడ పెట్రోల్ బంకు ఎత్తేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం పైగా ఫ్లై ఓవర్ల పుణ్యమా అని పెట్టిన రోడ్ డివైడర్ల వల్ల పెట్రోలు బంకు దగ్గరకు వెళ్ళాలి  అంటే కనీసం అయిదు కిలో మీటర్ల దూరం అయినా వెళ్ళాలి ! ఖాదిర్ భాయ్ లాంటి వాళ్ళ వల్ల అంతంత దూరాలు బండి నడిపించుకుని వెళ్ళాల్సిన బాధ తప్పింది అనుకుంటూ బండి ఆఫీసు వేపు దూకించాడు అప్పారావు !
**** 
ఆరోజు ఆఫీసులో జరిగిన గొడవ వల్ల అప్పారావుకి నిదుర పట్టలేదు ! చాలా సేపు టీవీ లో జగన్, చంద్రబాబు, కే. సి. ఆర్., చిరు, కిరణ్ కుమార్, సోనియాలు ఆ రోజు చేసిన యాత్ర, బంద్, ధర్నా, ప్రకటన ఇంకా ఇలాంటివే కొన్ని  రాజకీయ గంతుల  పైన చర్చలు న్యూస్ చానళ్ళలో చూసి చూసి బుర్ర పగిలి నంత తలనెప్పి వచ్చి కాస్త చల్లగాలికోసం బాల్కనీ లోకి వచ్చాడు అప్పారావు !  
కింద నుంచి ఏదో గుస గుసలు వినిపించి నట్లు అనిపించి చేతికున్న వాచీలో  టైం చూసుకుంటే అది ఉదయం 3.30 గంటలుగా చూపించింది ! ' ఈ సమయం లో గుస గుసలు వినిపిస్తున్నాయి ఏమిటబ్బా,  వాచ్మన్ ఏమైనా సరసాలు ఆడుతున్నాడేమో  ' అనుకున్నాడు అప్పారావు ! కానీ గొంతుల్లో ఆడ గొంతు వినిపించక పోయేసరికి ఎందుకైనా మంచిదని తలుపు వెనక పెట్టిన దుడ్డుకర్ర తీసుకుని, తన ఫస్ట్ ఫ్లోరు ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి చప్పుడు కాకుండా మెట్లు దిగి సెల్లార్ లోకి వచ్చాడు అప్పారావు !  అటూ ఇటూ చూసినా ఎటూ ఎవ్వరూ కనిపించలేదు ! వాచ్మెన్ కోసం చూస్తె హాయిగా తన మంచం మీద పడుకుని గుర్రుకొడుతూ కనిపించాడు ! 
" సింహాచలం.. ఒరేయ్ సింహాచలం... లేరా నాయనా " అని తట్టి లేపాడు అప్పారావు  ! 
ఉలిక్కి పడి లేచాడు సింహాచలం !  
" ఎవరది ? ఓ.. మీరా సార్ ? ఏమిటి ఇప్పుడు వచ్చారు ? బయటకు వెళ్ళాలా ? తలుపు తీయనా ? " గబా గబా లేచి గేటు వేపు వెళ్తూ అన్నాడు సింహాచలం !
" ఇలా లుంగీ బనీను లో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను కానీ కాపలా కాయకుండా ఇలా పడుకోవడానికేనా మేము నిన్ను పెట్టుకుందీ ? " క్లాసు పీకాడు అప్పారావు !
" అయ్యో ఇప్పుడే అలా మగత కమ్మేసింది కానీ రాత్రుళ్ళు నేనసలు పడుకోనండీ. ప్రమాణం " వాపోయాడు వాచ్మాన్ సింహాచలం !
" సర్లే  కానీ.. ఇందాక ఏవో గుస గుసలు వినిపిస్తే.. ఏమిటో చూద్దాం అని వచ్చా.. పద ఒకసారి సెల్లార్ అంతా చూద్దాం " అన్నాడు అప్పారావు !
సింహాచలం వెంటనే సెల్లార్ లైట్లు అన్నీ వేసాడు ! ఇద్దరూ కలిసి సెల్లార్ లో అన్ని వేపులా దృష్టి సారించారు ! ఎక్కడా ఏమీ కనిపించలేదు !  
" మీరేదైనా కల కన్నారేమో సార్ ? " సింహాచలం జోకాడు !
" నీ బొంద !  నిద్రే పోకపోతే.. ఇంక కల ఎలా కంటాను ? పద అంతా చూద్దాం "  అని కార్ల మధ్యకు వెళ్ళేసరికి పెట్రోలు వాసన వచ్చింది ! 
జాగ్రత్తగా చూస్తే రెండు ప్లాస్టిక్ కేన్లలో పెట్రోలు కనిపించింది ! కొంత పెట్రోలు కింద కూడా కనిపించింది ! 
" ఇదేమిటి సింహాచలం ఇక్కడంతా పెట్రోలు ఉంది పైగా కేన్లలో కూడా ఉంది మాధవరావుగారు ఏమైనా తెచ్చి మరిచిపోయాడా ? "  అడిగాడు అప్పారావు ! 
" మాధవరావుగారు వూళ్ళో లేరు కదా సార్ ?  " అని కిందకు వంగి మాధవరావు కారు కిందకు చూసాడు సింహాచలం ! అక్కడ అతనికి చేతిలో పొడుగాటి పైపుతో  నక్కి పడుకున్న చిన్నపిల్లాడు కనిపించాడు !
" ఎవడ్రా నువ్వు ? ఇక్కడేం చేస్తున్నావ్ ? " అంటూ వాడిని పట్టుకుని బయటకు లాగాడు సింహాచలం !
వణికిపోతూ బయటికి వచ్చిన ఆ కుర్రాడు కేర్ మని ఏడవడం మొదలు పెట్టాడు ! వాడి ముఖం చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపించింది అప్పారావు కి ! 
ఒక్కసారి లైటు వెలిగింది అప్పారావు బుర్రలో ' వీడు ఆ ఖాదిర్ కొడుకనుకుంటా ఆ మధ్య పెట్రోలు పోయించుకున్నప్పుడు వాడి దగ్గర చూసినట్లు ఉంది ' అనుకుని "ఒరేయ్ నువ్వు ఖాదిర్ కొడుకువా ?"  అడిగాడు అప్పారావు ! 
అవునన్నట్లు బుర్ర ఊపాడు ఆ కుర్రాడు ! అప్పారావు కి ఇప్పుడు అంతా అర్థం అవసాగింది !
" ఓరి దురార్గుల్లారా .. ఇదా మీ పని ? మా బళ్ళలో పెట్రోలు దొంగిలించి మాకే అమ్మేస్తున్నార్రా మీరు ? పైగా పెట్రోలుబంకు ధరలకే ఇక్కడ పెట్రోలు బంకు లేదని ఇలా సేవ చేస్తున్నాం అని బిల్డప్పు  ఒకటి మీ బాబుకి  " కోపంతో సివాలు తొక్కాడు అప్పారావు !
 గబగబా ఫ్లాట్లోకి వెళ్లి ప్యాంటు చొక్కా వేసుకుని, అప్పటికప్పుడు ఆ కుర్రాడిని  పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి అప్పగిస్తే ఆ ఇనస్పెక్టర్  మొత్తం కూపీ లాగాడు ! ' అప్పారావు కిందకు రావడం చూసి గేటు బయట నుంచుని ఉన్న ఖాదీర్ పారి పోయాడనీ, కారు కింద పడుకుంటే కనిపించవు, అందరూ మళ్ళీ పడుకున్నాక వచ్చి తీసుకెళ్తానని చెప్పాడనీ '  వెక్కుతూనే చెప్పాడు ఆ కుర్రాడు ! ఆ తర్వాత పోలీసులు వెళ్లి ఖాదిర్ ని అరెస్టు చెయ్యడమూ చూసాడు అప్పారావు ! కానీ కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఖాదిర్ అదేచోట పెట్రోలు అమ్ముతూ కనిపించాడు అప్పారావుకి ! 
అయితే అప్పారావు మాత్రం ఇప్పుడు పెట్రోలు అక్కడ కొనడం మానేసాడు !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )