పెద్దాయనకు కోపం వచ్చింది !

Wednesday, 29 September 2010

ఆ రోజు ముసురు పట్టి ఉంది. నేను ఏదో పనిమీద అటునించి వస్తూ, ఎలాగూ టయిం అయ్యింది కాబట్టి మా వాడిని కాలేజీ అవగానే బండి మీద తీసుకు వెళ్తే బస్సు ఎక్కాల్సిన బాధ  వాడికి ఇవ్వాల్టికి తప్పుతుంది, అని వాడి కాలేజీ దగ్గర వెయిట్ చేస్తున్నాను. చిన్నగా జల్లు పడుతుంటే కాలేజీ వరండా కిందికి చేరాను. వరండాలోంచి చూస్తే సాయంత్రం 4.30 కే చీకటి  పడుతున్నట్లు ఉంది.  అలవాటు ప్రకారం చుట్టూ ఉన్నవాళ్ళను గమనించడం మొదలు పెట్టాను.  రోడ్డుకి అటువేపు కొద్దిగా దూరంగా ఒక చెప్పులు కుట్టే పెద్దాయన  ఎందుకో నన్ను ఆకర్షించాడు.  కాలేజీ పార్కింగ్ (రోడ్డు మీదే లెండి ) లో మోటార్ సైకిల్స్  పెట్టి ఉన్నాయి. దాని ప్రక్కనే ఉన్న చెట్టు కింద  చిన్న చెక్కలతో చేసిన షాపు ముందు నీళ్ళు పడకుండా కట్టిన ప్లాస్టిక్ షీట్ల  కింద  చెప్పులు కుట్టే పెద్దాయన భార్యతో కలిసి కూర్చుని ఎవరైనా వస్తారేమో అని ఆశగా దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఈయన షాప్ కు పక్కనే పార్కయ్యింది. కారతను పార్క్ చేసిన తరువాత కారులోనే కూర్చొని ఎవరికోసమో ఎదురు  చూడటం మొదలు పెట్టాడు. ఇంక ఈ పెద్దాయనకు విపరీతమైన టెన్షన్ మొదలయ్యినట్లు ఉంది. ఎవరికైనా చెప్పులు కుట్టించుకోవాలని అనిపిస్తే తన షాపు కనిపించదేమో ఎలా అని బాగా బెంగ పట్టుకుంది. లేచి నిల్చుని కొద్దిగా ముందుకు వచ్చి అటూ ఇటూ చూసాడు. మళ్ళీ వెళ్లి భార్య దగ్గర కూర్చుని ఆమెతో ఏదో అన్నాడు ఆమె తల అడ్డంగా తిప్పి ఏదో అంది. అంతే పక్కనే ఉన్న న్యూస్ పేపర్ గుండ్రంగా  కర్రలా చుట్టి  ఆమెను దానితో గట్టిగా కొట్టాడు. ఆమె పాపం కిక్కురు మనకుండా కూర్చుంది. ఇలా ఒక రెండు సార్లు జరిగింది. మూడో సారి లేచి కోపంగా కారులో కూర్చున్న అతని దగ్గరకు వెళ్ళాడు కోపంగా ఏదో అన్నాడు. కారు అడ్డం తీయమని అంటున్నాడని అర్ధం అయ్యింది. పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్ళ ముందు పెట్టమని సైగ చేసాడు పెద్దాయన.  మరి మోటార్ సైకిళ్ళు తీయడానికి అడ్డం వస్తుందనో, నేనెందుకు తీయాలనో కారులో ఉన్నాయన ఒప్పుకోలా. పెద్దాయన కోపంతో ఊగిపోతూ పార్కింగ్ దగ్గరున్న సెక్యూరిటీ అతనిని గట్టిగా పిలిచాడు. అతను వచ్చి విని ఈ పెద్దాయనకే ఏదో చెప్పాడు. బహుశా పార్కింగ్లో పెట్టింది తీయమనలెం అని అయి ఉంటుంది. మళ్ళీ భార్యదగ్గారికి  వెళ్లి ఏదో అన్నాడు ఆమె నోరు ఎత్తలేదు. కోపంతో ఊగిపోతూ పేపర్ చుట్టతో మళ్ళీ కొట్టాడు. మౌనంగా చీర చెంగుతో కళ్ళు వత్తుకున్దామే.  షాపులో ఉన్న చెప్పులు కుట్టే సామాగ్రి ఎత్తి గిరవాటు వేయబోయాడు పెద్దాయన. ఇంతలో ఒక ఇద్దరు అమ్మాయిలు షాప్ దగ్గరకు వచ్చి తెగిన చెప్పు చూపించారు. పెద్దాయన మోహంలో అకస్మాతుగా ఆనందం కనిపించింది.గబా గబా చెప్పు తీసుకుని కుట్టి ఇచ్చేసాడా పెద్దాయన. ఇంతలోనే ఇంకో కారు వచ్చి ఆ పెద్దాయన షాప్ ముందే ఆగింది. అందులో నుంచి దిగినతను తన చెప్పులు రిపేర్ చేయించు కున్నాడు. ఇంక పెద్దాయన హుషారుగా మారిపోయాడు. భార్యతో జోకులేయడం మొదలు పెట్టాడు. ఆమె చిన్నగా అలిగింది. పెద్దాయన లేచి పక్కనున్న టీ బంకు దగ్గరనుంచి టీ తెచ్చి భార్యకు ఇచ్చి తను  తీసుకుని తాగుతూ కబుర్లు చెబుతూ  ఆమెను నవ్వించాడు. తరువాత మళ్ళీ లేచి కారు దగ్గరికి వచ్చి కారతనితో కూడా నవ్వుతూ మాట్లాడాడు. కారతను పెద్దాయన వైపు అయోమయంగా చూసాడు. ఇంతకు ముందు తనతో మాట్లాడిన విధానికీ, ఇప్పటి తీరుకీ ఉన్న తేడా ఎందుకో అతనికి అర్ధం అయినట్లు లేదు. మొహం ముడుచుకుని కూర్చున్నాడు  ఆ కారతను పెద్దాయన వేపు చూడకుండా.  పెద్దాయన తను చెప్పాల్సింది తను చెప్పెసినట్లు ఫీలయిపోయి మళ్ళీ భార్యదగ్గరికి వెళ్లి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చుట్ట వెలిగించాడు. ఇంక ఈ రోజుకి  చెప్పులు కుట్టించుకోవడానికి ఎవరూ రాకపోయినా ఆపెద్దాయనకు కోపం రాదనుకుంటాను. అలా ఆ పెద్దాయన కాళీ కడుపుకూ, నిండిన కడుపుకూ ఉన్న తేడాను కొద్దిసేపట్లోనే కళ్ళ ముందు కట్టేలా చేసాడు.

3 comments:

శరత్ కాలమ్ said...

Nice.

వాత్సల్య said...

అలా ఆ పెద్దాయన కాళీ కడుపుకూ, నిండిన కడుపుకూ ఉన్న తేడాను కొద్దిసేపట్లోనే కళ్ళ ముందు కట్టేలా చేసాడు.
>> True

Overwhelmed said...

aa kopam edo ayana wife ki vaste bagundedi for a change.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )