ఇలా చేస్తే మనం ఇంకా సుఖంగా బ్రతుకగలం !

Friday 1 October 2010

నిన్న అయోధ్య పై అలహాబాదు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సయోధ్యను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన తీర్పులా కనిపించింది. ఎన్నో ఏళ్ళ తరువాత శాంతిని కాపాడాలనే తాపత్రయం ప్రజలతో పాటు ప్రభుత్వంలో కూడా కనిపించింది. అందరూ ఉత్కంటతో ఎదురు చూసిన తీర్పు ప్రజాస్వామ్య చిన్హంలా రావడం దేశ ప్రజలందరినీ సంతృప్తి పరిచింది అనడంలో  ఏ మాత్రమూ అనుమానంలేదు. తీర్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో కానీ, తీర్పు విన్న తరువాత ప్రతిక్రియగా కానీ ఎటువంటి అవాంచనీయ ఘటనలూ జరగకపోవడం, మన దేశం నిజమైన సర్వమానవ  సౌబ్రాత్వుత్వాన్ని, సర్వమత సామరస్యాన్ని కోరుకుంటుందని ప్రపంచానికి మరోసారి ఎలుగెత్తి చూపింది.  మనమంతా ఇంత శాంతియుతంగా ఊపిరి తీసుకోగలిగిన సుందర క్షణాలు చెదరకుండా ఉండటానికి కారణాలు మాత్రం ప్రధానంగా మూడు చర్యలు.
1.  భద్రతా చర్యలు :  ముందు జాగ్రత్త చర్యగా  వివాదాస్పద స్థలాలనూ, సున్నిత స్థలాలనూ  భద్రతా వలయాలలో  ఉంచడమూ, కార్యాలయాలకు, స్కూళ్ళూ  కాలేజీ లకు  సెలవులు ప్రకటించడమూ, దుకాణాలను, వ్యాపార సంస్థలనూ మూయించడమూ, సందిగ్ద చరిత ఉన్న వ్యక్తులను నిర్భందం లోనికి తీసుకోవడమూ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియచేసి ప్రజలనూ  శాంతి వేపు దృష్టి సారించేలా చేసింది.      

2మీడియా పై నియంత్రణ  : టీవీలు, న్యూస్ పేపర్లకు వార్తా ప్రసారానికి మసాలాలను అంటించనీయక పోవడమూ, బాబ్రి మసీదు కూల్చివేత దృశ్యాలను పునః ప్రదర్శించనీయక పోవడమూ, కోర్టులోనికి మీడియాను అనుమతించక పోవడమూ, కోర్టు తీర్పుకు విపరీతార్ధాలు తీయనీయక పోవడమూ టీవీలు చూస్తున్న ప్రజల భావోద్వేగాలను నియంత్రించేలా చేసింది. 

3. బల్క్ ఎస్ ఎమ్ ఎస్ ల పై నిషేధం : అదిగో పులి అంతే ఇదిగో తోక అనే విధంగా అపవాదులు పుట్టించడం లోనూ, వ్యాపింపజేయడం లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్న మొబైల్  బల్క్ ఎస్ ఎమ్ ఎస్ లను నిషేదించడం ద్వారా పనికిరాని అపవాదుల ప్రవాహం ఆగేలా చేసింది.

 మొదటిదైన భద్రతా చర్యలు ఇంత తీవ్ర స్థాయిలో  నిత్యం చేపట్టడం  కష్టమైనా కొంత వరకూ అయినా ఉంటుంటే హింస రగలకుండా ఉంటుంది.
అయితే మన జీవితాలు ఇలాగే శాంతియుతంగా సాగిపోవాలంటే మటుకూ మీడియా ప్రసారాలపై స్వయం నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాల్సిందే. టీ ఆర్ పీ రేటింగులకోసమో, తమ చానళ్ళ ప్రాభవం పెంచుకోవడం కోసమో లేని వార్తలను పుట్టించడమూ, లేదా సంఘటనలకు వక్రభాష్యాలు చెప్పడమూ చేయకుండా, ఎటువంటి మషాలాలూ అద్దని వార్తలను చూపించడమూ, భావోద్వేగాలు రెచ్చిపోతాయనుకుంటే ఆ వార్తలను తక్కువ మోతాదులో తెలియచేయడమూ , రక్త మాంసాలతో నిండిన దృశ్యాలను చూపకుండా వార్తను మాత్రం తెలియచేయడం వంటి చిన్న చిన్న సుగుణాలను న్యూస్ చానళ్లు పెంపొందిచేలా ప్రయత్నించాలి.

ఈ అయోధ్య తీర్పు పుణ్యమా అని పనికిరాని ఎస్ ఎమ్ ఎస్ లు రాక హాయిగా ఉండింది. ప్రతి టెలికాంసేవల కంపెనీకీ, బల్క్ ఎస్ ఎమ్ ఎస్ లను పంపే ముందు దాన్ని సెన్సార్ చేసే హక్కు ఇచ్చి, ఆ నెట్ వర్క్ నుంచి ఒకవేళ ఏదైనా అపవాదు పాకితే ఆ నెట్ వర్క్  అందిస్తున్న కంపెనీని బాధ్యులుగా చేయాలి.

ఇలా చేస్తే మనం ఇంకా సుఖంగా బ్రతుకగలం !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )