అతి ఆడంబరంగా మొదలైన కామన్ వెల్త్ గేమ్స్ అసమర్థ నాయకత్వ కారణంగా మసకబారుతున్న మన దేశ ప్రతిష్టను పునః తేజోవంతం చేసాయి. మన దేశానికి కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించే సత్తా లేదేమో అని ఎవరికీ అనుమానం లేదు. ఆ గేమ్స్ కు పెట్టే ఖర్చేదో స్టేడియాలను దేశం మొత్తం మీద, జిల్లాల వారీగా నిర్మిస్తే, క్రీడాకారులకు సరైన శిక్షణ దొరికే ఏర్పాటు చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉంటుందనీ, ఒలెంపిక్ మెడల్స్ కూడా పెరుగుతాయనీ ఒక ఆశ తప్ప. ముందు నుంచీ సరైన నాయకత్వం చూపించి ఉంటే ఇంతకన్నా తక్కువ ఖర్చుతో, అవినీతికి అవకాశం ఇవ్వకుండా, విమర్శలకు తావివ్వకుండా సంబరాలు మొదలయ్యేవేమో. మన రాష్ట్రపతి ప్రతిభాభారతి గారి ఉపన్యాసంలో అబుల్ కలాంగారి ప్రస్తావన రాంగానే మోగిన చప్పట్లు( అందరికన్నా ఎక్కువగా ), ఆయనను మనమంతా ఎంత మిస్ అవుతున్నామో తెలియ చేస్తున్నాయి. సురేష్ కాల్మాడీ గారు పాపం సుదీర్ఘ సుత్తి వేసి తాను అంతా బాగా చేసినట్లు చూపించడానికి ప్రయత్నించినా పదే పదే, గేలి చేస్తూ బూ.. అన్న జనం నిన్ను మేం క్షమించలెం అని చెప్పక చెప్పారు. హరిహరన్ గారి స్వాగతాన్ని చూపించిన విధానమూ, ఏడేళ్ళ బుడతడితో కలిసి రిధం అఫ్ ఇండియా అంటూ డ్రమ్స్ చేసిన నాదం బావుండటమే కాక, విదేశీ క్రీడాకారులతో కూడా నృత్యం చేయించింది. హీలియం బెలూన్ వెంబడే పైకి లేచిన తోలుబొమ్మలు నృత్యం చేస్తున్నట్లు ఊగడం చక్కగా ఉండింది, యోగ ముద్రలో వివిధ చక్రాలను తేజోవంతం చేస్తూ ధ్యాన మగ్నమైన మూర్తి, గాంధీ గారి మూర్తి కిందనుంచి ఉద్బవించిన తీరు చాలా గొప్పగా అనిపించింది. ఇసుకను అప్పటికప్పుడు సర్దుతూ గాంధీ గారి పాత చిత్రంగా మలచిన తీరు కూడా బాగుంది. దేశం మొత్తం మీద ఉన్న అన్నిటినీ చూపాలనే ఉత్సాహంలోరైలు వెంబడే వచ్చిన వివిధ రకాలైన వేషాల వల్ల స్టేడియం కలగూర గంప లా తయారై నట్లు కొద్దిగా అనిపించకపోలేదు. రెహమాన్ కామన్వెల్త్ గేమ్స్ కోసం స్వరపరిచిన గీతం బానే ఉంది కానీ, స్పష్టత, ఉద్వేగం తగ్గినట్లు అనిపించింది. చివరికి ఆయన జయహో పాటతోనే పూర్తి జోష్ తేగలిగారు. ప్రత్యక్ష ప్రసారం చేస్తామంటూ దూరదర్శన్ వారు వాణిజ్య ప్రకటనలతో చీకాకు తెప్పించి, ఆలస్యంగా ప్రసారం చేస్తూ అపహాస్యం చేసారు.
ఇంక ఒక రెండు వారాలు జరిగే ఆటలలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకూడదనీ, భద్రతకు ఎటువంటి భయమూ ఉండదనీ, మన క్రీడాకారులు మెడళ్ళ పంట పండిస్తారనీ ఆశిస్తాను. అందరు అతిధులను సగౌరవంగా, సంతృప్తిగా పంపుతూ వీడ్కోలు చెప్పినాక మనం నిజంగా జయహో అని పాడుకుందాం. ఆపైన కాల్మాడీలకు కూడా వీడ్కోలు చెప్పేద్దాం.
కాల్మాడీలకు కూడా వీడ్కోలు చెప్పేద్దాం.
Monday, 4 October 2010
Posted by ప్రభు at 10/04/2010 05:21:00 pm
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
veedkol cheppavalasindhe
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )