సిగరెట్లు త్రాగటం ఎలా మానాలి ? ఎలా మానాలి ? ఎలా మానాలి అని టీవీ సీరియల్లో లాగా మూడు మూడు సార్లు అనుకుంటూ బుర్రమీద మిగిలిన గుప్పెడు వెంట్రుకలూ గట్టిగా పీక్కుంటూ ఆలోచించినా అర్ధం కాక బెంగ పెట్టేసుకుంటున్నాడు సుబ్రమణ్యం.
దానితో బుర్ర వేడెక్కి రోజుకన్నా ఎక్కువ సిగరెట్లు తాగేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం శ్రీమతికి ఈయన వ్యవహారం చూసి భయం వేసింది.
" మీరు సిగరెట్లు మానలేకపోతే పోనీయండి కానీ ఇలా ఉన్న కాస్త జుట్టూ పీకేసుకుని అరగుండులా ఉండే మీరు గుండులా అయిపోయి తరవాతచేయరానిదేదైనా చేసేస్తే నా మంగల్యానికేదీ దిక్కు ? " అదేదో దిక్కుమాలిన సీరియల్ లోని హీరోయిన్ లాగా కళ్ళలో నీళ్ళు కాలువలా కార్చేసింది.
" అస్సలే బుర్రతిరిగి నేనేడుస్తుంటే నీ ఏడుపెంటీ నన్ను నా మానాన వదిలేసి అటుపో " అని అరిచేసి పీక్కుని చేతిలో పట్టుకున్న జుట్టు సిగరేట్టనుకుని నోట్లో పెట్టుకుని వెలిగించుకుని మూతి కాలి బావురుమన్నాడు సుబ్రమణ్యం.
అస్సలు సిగరెట్లు మానేయాల్సి వస్తుందని కానీ, మానడం ఇంత కష్టమని కానీ అనుకుంటే ఈ వెధవ సిగరెట్లు తాగడం మొదలు పెట్టేవాడు కాదు సుబ్రమణ్యం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే కాలం లోనే, వాళ్ళ నాన్న త్రాగే దున్నపోతు బ్రాండ్ ( ఆ కాలంలో ఆ బ్రాండ్ ఘాటు గురించి గొప్పగా చెప్పుకుంటూ దాన్ని ప్రేమగా అలానే పిలుచుకునేవారులెండి ) కార్టన్లు కార్టన్లుగా దాచుకున్న సిగరెట్ ప్యాకెట్ లలోంచి ఒక పాకెట్ చొప్పున దొంగిలించి బొడ్డూడని మిత్రులతో కలిసి చెరువు గట్టు మీద రింగులు రింగులుగా గుప్పు గుప్పు మని పొగ ఊదుతూ సిగరెట్లు మానాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు సుబ్రమణ్యం
హిందీ సినిమాలలో శత్రుఘన్ సిన్హాలాగా, దక్షిణాదిన అప్పుడప్పుడే కొత్తగా వస్తూన్న రజనీకాంత్ లాగా స్టయిల్ గా హెర్క్యులిస్ సైకిల్ మీద చేతులు వదిలేసి తమ కాలేజ్ అమ్మాయిలకు సైటు కొట్టేటప్పుడు కూడా సిగరెట్ల వల్ల తనకు అనారోగ్యం చుట్టుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదు.
పెళ్లైనాక కొత్త పెల్లికూతురుగా ఇంట్లోకి అడుగు పెట్టిన రాజ్యం కూడా స్టయిల్ గా సిగరెట్ తాగుతున్న మొగుడిని ఎడ్మైరింగ్ గా చూస్తూ అడ్డు చెప్పకపోవడమూ, తన చేతులతోనే సుబ్రమణ్యం నోట్లో సిగరెట్ కి అగ్గిపుల్ల గీసి వెలిగించి ఇస్తూ ఉండటమూ చేసే సరికి సుబ్రమణ్యం రెచ్చిపోయాడు. పైగా ఇదివరకులా జామాకులు నమలడమో, కిళ్ళీ తినడమో, చింగం నమలడమో చేసి వాసన దాచుకోవాల్సిన అవసరం లేకపోయే సరికి రోజుకు ఒక్క పాకెట్ తాగేవాడు కాస్తా ఇప్పటికి రోజుకి ఆరేడు పాకెట్ల సిగరెట్లు తాగే స్టేజ్ కి చేరిపోయాడు.
పెరిగిన దగ్గూ, పడుతున్న కళ్లె లో పెరుగుతున్న ఎరుపూ సుబ్రమణ్యం ను పేరు మోసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు పరిగేట్టిన్చేసాయి.
" నువ్వు సిగరెట్లు తాగడం మానేయకపోతే నీ ఊపిరితిత్తులు మటుమాయం అయిపోయి నువ్వుకూడా 'డాం' అనడం ఖాయం ", అని డాక్టర్ గారు చెప్పిన దగ్గరి నుంచీ సిగరెట్లు మానడం ఎలా అనే విషయం మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు సుబ్రమణ్యం.
" ఎన్నాళ్ళ నుంచో తాగుతున్నావు కాబట్టి ముందు కొద్ది కొద్దిగా తగ్గించితే ఇబ్బంది లేకుండా మానేయోచ్చు ", అని ఎవరో చెబితే ఒకరోజు తగ్గించేయడమూ, మళ్ళీ రెండోరోజు నిన్నతగ్గించిన కోటా కూడా కలుపుకొని పెంచేయడమూ జరిగింది.
" ఇలా కాదు నువ్వు సిగరెట్లు తాగడం మానేస్తున్నట్లు అందరికీ చెప్పు, ఆ తరువాత మానేయకపోతే అందరూ నవ్వుతారని చచ్చినట్లు మానేస్తావని ", ఎప్పుడూ పాన్ పరాగ్ నమిలే బావగారు చెబితే, ఇదేదో బాగుందనుకుని ఒక మంచి రోజు చూసుకుని " నేను సిగరెట్లు తాగడం మానేస్తున్నానోచ్ ", అని ప్రకటించేసాడు. ఎలాగూ మానేస్తున్నాను కదా అని అమెరికా నుంచి మేనల్లుడు ప్రేమతో కొనితెచ్చిన సిగరెట్ లైటర్ ను ఫ్రండ్ కి ఇచ్చేసాడు సుబ్రమణ్యం.
కానీ ప్రకటించిన కాస్సేపటికే నాలుక పిడచకొట్టుకు పోయినట్లూ, లాగేస్తున్నట్లూ ఫీలైపోయి గబ గబా బడ్డీకొట్టుకి వెళ్లి సిగరెట్టు కొని ముట్టించేసాడు. " ఇంక మానలేను కానీ నా లైటర్ నాకివ్వు ", అని ఫ్రండ్ ని అడిగితే, " అస్సలు నువ్వు దగ్గర సిగరెట్, సిగరెట్ లైటర్ లు పెట్టుకోకుండా, తాగాల్సి వచ్చినప్పుడల్లా బడ్డీ కొట్టుకు వెళ్లి తాగుతుంటే కూడా సిగరెట్లు మానేయోచ్చు ", అని హింటిచ్చాడు లైటర్ వాపస్సివడం ఇష్టం లేని ఆ స్నేహితుడు.
ఇదీ బాగానే ఉందనుకుని కొన్నాళ్ళు అలానే చేసాడు, కానీ " మాటి మాటికీ బడ్డీ కొట్టుకు వెళ్ళటం మానెయ్యకపోతే మేమో ఇవ్వాల్సి వస్తుంది ", అని బాస్ వార్నింగ్ ఇవ్వడం, పైగా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పెట్టడం వల్ల మళ్ళీ ఇదివరకులానే సిగరెట్ పెట్టె, కొత్త లైటర్ తో తిరగడం మొదలు పెట్టాడు సుబ్రమణ్యం.
ఇలా మానేయడమూ, మొదలెట్టడమూ ప్రహసనంలా అయిపోయి కొలీగ్స్ అందరూ " సుబ్రమణ్యం మాటంటే మాటే. ప్రతిరోజూ మాట మార్చే రకం కాదు మా సుబ్రమణ్యం. చూడండి ప్రతిరోజూ ఒకే మాట చెబుతాడు, 'రేపటినుంచీ సిగరెట్లు తాగనని' " అంటూ సెటైర్లు వెయ్యడం మొదలు పెట్టారు.
మూతి కాల్చుకున్న మొగుడిని చూసి బెంబేలు పడిపోయిన రాజ్యం పక్క వీధిలో ఉన్న వాళ్ళ బాబాయిని పిలిచి విషయం చెప్పి ముక్కు చీదేసింది.
" నువ్వూరుకో తల్లీ ఇంత చిన్న విషయానికి ఇలా తల్లడిల్లిపోతే ఎలా ? నేనున్నానుగా ? ", అని రాజ్యానికి భరోసా ఇచ్చి కాలిన మూతిని అద్దంలో చూసుకుంటూ బర్నాల్ రాస్తున్న సుబ్రమణ్యం వేపు తిరిగాడు రాజ్యం వాళ్ళ చలమయ్య బాబాయ్
" ఏమిటోయ్ సుబ్రమణ్యం, నువ్వు మరీనూ ? పెళ్లైనప్పుడు హ్రితిక్ రోషన్ లా రింగుల జుట్టుతో ఉండేవాడివి, ఇలా రాకేశ్ రోషన్ లా అయిపోయావేమిటీ ? "
జోకులు భరించే ఓపిక లేదు మామయ్యగారూ, నవ్వులాటై పోయింది నా బ్రతుకు. నా బాధ ఎవరికి చెప్పుకోను ? ", అని ఏఎన్నార్ లెవల్ లో గొంతు దగ్గర గుండీ సరిచేసుకున్నాడు సుబ్రమణ్యం.
" పిచ్చివాడా ! అస్సలు సిగరెట్లు తాగడం మానాలంటే అన్నిటికన్నా ముందు నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ఒక విషయం చెప్పు ఎవరి ముందయినా సిగరెట్లు తాగాలంటే సంకోచిస్తావా ? " అడిగాడు చలమయ్యగారు.
" భలేవారే మామయ్యగారూ, మీ ముందు ఎప్పుడైనా సిగరెట్ తాగానా ? నాకు పెద్దలంటే గౌరవం. మావేపు కానీ, రాజ్యం వేపు కానీ పెద్దలముందు ఎప్పుడూ తాగలేదు, తాగను. అలాగే మా సీనియర్ల ముందు కానీ, పై ఆఫీసర్ల ముందు కానీ తాగను. " బర్నాల్ నేప్కిన్ తో తుడుచుకుంటూ చెప్పాడు సుబ్రమణ్యం.
" ఇంకే, ఇప్పుడు నువ్వు సిగరెట్లు మానెయ్యడం చాలా సులువు. నువ్వు చెయ్యవలిసిన మొదటిపని నీ మనసులో సిగరెట్లు మానాలనే దృఢమైన కోరిక ను పెంచుకోవడం. తరువాత ఇన్నాళ్ళుగా తాగి మానుతున్నావు కాబట్టి కొంత ఇబ్బంది కలుగుతుంది అంటే కడుపులో నొప్పి రావొచ్చు, వాంతులయ్యేలా అనిపించొచ్చు, భరించలేని తలనొప్పి రావొచ్చు" అయినా సరే నేను మళ్ళీ సిగరెట్లు తాగను ఎందుకంటే నేను మానేసాను కాబట్టి , ఈ ఇబ్బందులు భరిస్తాను ", అని పదే పదే నీ మనసుకు చెప్పుకోవాలి. ఇంక " పెద్దల ముందు తాగకుండా ఉండ కలను కాబట్టి ఎప్పుడూ కూడా తాగ కుండా ఉండ గలను ", అని ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి. ఇలా నిన్ను నువ్వు తయారు చేసుకుంటే నువ్వు జన్మలో మళ్ళీ సిగరెట్లు తాగలేవు. " గీతోపదేశం చేసాడు చలమయ్యగారు.
" అంతేకాదమ్మాయీ, నువ్వుకూడా కొన్ని నెలలు మీ ఆయనకు తోడుగా నిలబడాలి. కొత్తలో సిగరెట్లు తాగకపోవడం వల్ల వచ్చే అసహనం వల్ల, లేదా తలనోప్పీ, కడుపునోప్పీ, వామిటింగ్ సెన్సేషన్ ల వల్ల సుబ్రమణ్యం కు కోపం రావడమూ, తిక్క తిక్క గా ప్రవర్తించడమూ ఉంటాయి కాబట్టి, నువ్వు శాంత మూర్తిలా ఉండి అతనికి సాయ పడాలి. అనవసరమైన వాదులాటలు లేకుండా అతనిని సాధ్యమైనంతగా బిజీగా ఉంచితే మీ ఆయన సిగరెట్లు మానేస్తాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. " చెప్పాడు చలమయ్యగారు.
భార్యాభర్తలు ఇద్దరూ ఆరోజు చలమయ్యగారికి చక్కని విందు భోజనం పెట్టి కృతజ్ఞతలు చెప్పుకుని, రేపటినుంచీ ఇంక నో సిగరెట్లని చలమయ్యగారికి ఒట్టేసి చెప్పి, చలమయ్యగారిని సాగనంపారు.
సో సుబ్రమణ్యం మళ్ళీ సిగరెట్లు మానేసాడు !
సుబ్రమణ్యం మళ్ళీ సిగరెట్లు మానేసాడు !
Wednesday, 6 October 2010
Posted by ప్రభు at 10/06/2010 09:01:00 pm
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )