వర్ధిల్లుతోంది ప్రజాస్వామ్యం !

Wednesday, 15 December 2010

" ఏమో అనుకున్నాను కానీ నువ్వు గట్టి పిండానివేనోయ్ ప్రతి పక్ష నాయకుడి బీ పీ పెంచేసి జుట్టు పీక్కునేలా చేసావు " అధికార పార్టీ సీనియర్ నేత !
" నాదేముంది సార్ అంతా మీ బోటి పెద్దల ట్రయినింగే   కదా ? "  వినయంగా అన్నాడు బుల్లి నేత లోలోపల సంబర పడిపోతూ !
" లేకపోతే, అవినీతనీ, ప్రజల సమస్యలనీ పెద్ద ఫోజులు పెట్టేస్తున్నాడు ఆ అప్పోజిషన్ లీడరు "
" మీరలా మా వెన్ను తడుతున్నంత కాలం మీ శిష్యులం మేమంతా కలిసి సభలో మన లొసుగులు బయట పడనీయకుండా, అసలు ఏ విషయం మీద కూడా చర్చ జరగనీయకుండా అల్లరి చేసేసి, అవసరమైతే అప్పోజిషన్ వాళ్ళూ వాకవుట్ చేసినాక పై పై చర్చలు జరిపించేసి మనం పెట్టిన బిల్లులన్నీ పాస్ చేసేయిస్తాం సార్ "  రెచ్చిపోయాడు బుల్లి నేత !
" ప్రతి సారీ ఇలా ఎలా మేనేజ్ చేస్తారయ్యా ? " పెద్ద నేతకి అనుమానం వచ్చింది !
" ఏముంది సారూ. స్పీకరు మనోడేగా ? అసలు వాళ్ళు నోటీసిచ్చిన పాయింట్లను చర్చకే అనుమతించడు. పొరబాటున అనుమతించినా నాలుగు మాటలు మాట్లాడగానే మేమంతా అల్లరి చేసి, అప్పోజిషన్ లో బీ పీ ఎక్కువున్న వాళ్ళను నానా మాటలూ అనేస్తాం. మీ పరిపాలనలో అట్లా జరిగిందనీ, అసలు అన్నిటికీ మీరు మీ ప్రభుత్వంలో చేసిన తప్పులే కారణాలనీ, మీరు దద్దమ్మలనీ, ప్రజలు మిమ్మల్ని చీకొట్టారనీ, అసలు మాట్లాడే అర్హతే లేదనీ, మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ అంటాం, ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా ఎత్తి దెప్పి పోడుస్తాం. వాటికి ఎదురు చెప్పీ, మనల్ని తిప్పి తిట్టీ  వాళ్ళు అలిసి పోయి వాకవుట్  చేసేస్తారు, లేకపోతే సభకు అడ్డుతగుల్తున్నారని చెప్పి మార్షల్స్ తో బయటికి లాగేయిస్తాం, సందు చూసుకొని మనం పెట్టిన బిల్లులు పాస్ చేసేద్దాం.  తరువాత మనవాళ్ళందరూ పేపర్ల వాళ్ళకూ, టీవీ ల వాళ్ళకూ ఇంటర్వ్యూలు ఎడాపెడా ఇచ్చేసి   ప్రజాస్వామ్యాన్ని అప్పోజిషనోళ్ళు  అపహాస్యం చ్సేస్తున్నారానీ, ప్రజల సమస్యలు చర్చించడానికి వాళ్లకు చిత్తశుద్ధి లేదనీ ఎదురు దాడి చేసేద్దాం " వివరించాడు బుల్లినేత సంబరంగా !
" మరి అప్పోజిషనోళ్ళు ఊరుకుంటారంటావా ? మనవాళ్ళ మీద కేసులు పెడితే ? "   ఎంతయినా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఇంకా పూర్తిగా చావని పెద్ద నేత అడిగాడు !
పడీ పడీ నవ్వాడు బుల్లి నేత !  " ఊరుకోండి సార్ భలే జోకులేస్తారు మీరు. మన సభలలో జరిగే విషయాలను స్పీకరు అనుమతిలేకుండా కోర్టులు ఎలా వాదిస్తాయి సార్ ? పొరబాటున ఏదైనా న్యాయమూర్తి సమన్లు ఇచ్చినా, మన స్పీకరు వాళ్లకు తనను పిలిచే హక్కు రాజ్యాంగం ప్రకారం లేదని చెబుతాడు. మన నేతలను ప్రశ్నించ గలిగే జాయింట్ కమిటీలు వెయ్యడానికి మనం  ఎలాగూ ఒప్పుకోం కాబట్టి మనకు తిరుగు లేదు.ఇదే పద్దతి మనం కేంద్రం లోనూ పాటిస్తున్నాం సార్.  " వివరించి చెప్పాడు బుల్లి నేత. 
" సరేనోయ్ అలాగే కానీయండి. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి ! "  అంటూ గ్లాసెత్తి చీర్స్ కొట్టాడు పెద్ద నేత !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )