రాక్షసంగా ప్రవర్తిస్తూన్నఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎన్నాళ్ళు సహిద్దాం ?

Thursday, 23 December 2010

కళ్ళు తెరిచి, కుళ్ళు కడిగి,
పళ్ళు కరిచి, రాళ్ళు ఎత్తి,
ఒళ్ళు వంచి, కాళ్ళు మడిచి,
ముళ్ళు ఏరి, బీళ్ళు దున్ని,
నీళ్ళు వెతికి, మళ్ళు తడిపి,
బళ్ళు నింపి, వూళ్ళు నిలిపి,
వేళ్ళు విరిగి, తోళ్ళు చిరిగి,
ఇళ్ళు చేరి, వొళ్ళు మరిచే
దేవుళ్ళు మన రైతన్నలు.
 తన రక్తాన్ని చెమటగా కార్చి పంట సిరులతో  మన అందరి కడుపు నింపే రైతన్నలకు ఏమిచ్చినా ఋణం తీరదు !  
కానీ మనం ఏం చేస్తున్నాం ?
 సమయానికి సరిపడిన విత్తనాలు దొరకక నాసి రకం విత్తనాలు వేసి, ఎక్కడ చూసినా ఎరువులున్నా దొంగ మార్కెట్లో అమ్మి జనం దోచుకుంటుంటే, అంతా తన ఖర్మ అని అనుకుంటూ, నేల తల్లిని నమ్ముకున్న రైతన్నలు డబ్బుకోసం  మేం అది చేస్తాం ఇది చేస్తాం అని డంబాలు పలికే  బాంకులను అప్పడిగితే కుదరదనే సరికి లాభం లేక తప్పని సరిగా  సూక్ష్మ రుణాల విష వలయం లో కొట్టు మిట్టాడుతుంటే చోద్యం చూస్తూ సరైన పథకాలను గురించి ఆలోచించకుండా ఏదో చేసాం అనిపించుకోవడానికి బిల్లులు పెట్టేసి, శభాష్ అని మన వీపు మనమే తట్టుకుని చప్పట్లు కొట్టేసుకుంటున్నాం !  వీటన్నిటినీ నియంత్రించాల్సిన ప్రభుత్వ విభాగాలు అవినీతి సుఖం మరిగి మొహం చాటేస్తే ఊరుకుంటున్నాం ! లక్షల కోట్ల కుంబకోణాలు చేస్తూ బంగారు భూములను బంజరులుగా చూపిస్తూ ప్రభుత్వమే అమ్ముకుని డబ్బు చేసుకుంటుంటే వదిలేస్తున్నాం ! ప్రాజెక్టుల పేరుతో ఖజానాలు ఖర్చు చేసి వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకుంటుంటే కిక్కురుమనకుండా కూర్చున్నాం !   చల్లిన విత్తనాలు మొలకెత్తక  , మొలకెత్తిన విత్తనాలను కన్నబిడ్డల్లా సాకడానికి తాను కష్ట పడుతూ, పెరిగిన కూలి కూడా నవ్వుతూ ఇస్తూ, వచ్చే దిగుబడి బొటాబొటిగా సరిపోతున్నా నేల తల్లిమీద  నమ్మకం చావక మళ్ళీ మళ్ళీ పంట పిల్లల్ని పెంచుతున్న రైతన్నలకు ఈ సంవత్సరం పూర్తిగా నడుం విరిగిపోయినంత పనైపోయింది ! వేరే రాష్ట్రాలలో కన్నా తక్కువ గిట్టుబాటు ధర అయినా దొరుకుతున్దిలే ఎలాగో మళ్ళీ విత్తుకోవచ్చు  అని ధైర్యం గా ఉన్న రైతన్నలను వరస తుఫానులూ, వరదలూ ఉక్కిరి బిక్కిరి చేసాయి !  ఇంటికి చేరవలిసిన ఫలసాయం పొలం లోనే కూలిపోతే, కుళ్ళిపోతే, గుండె చిక్క బట్టుకుని ఎంత కుదిరితే అంత అని సాధ్యం అయినంత కాపాడుకుని పోగుచేశారు రైతన్నలు ! ఇంటికొచ్చిన గింజలను ప్రభుత్వం ప్రకటించిన పాకేజీ ప్రకారం అమ్ముకున్నా ఆదాయం మాట దేముడెరుగు అప్పు కూడా తీరదని లెక్కలు చూసుకుని గుండె పగిలి కొందరు రాలుతుంటే, దారి తోచక కొందరు బలవంతంగా ప్రాణ త్యాగం చేస్తోంటే స్కాంల రూపంలో, ప్రాజెక్టుల పేరుతో తాము  మింగిన లక్షల కోట్లతో పోలిస్తే అతి తక్కువ మొత్తాన్ని దేశానికి వెన్నెముక అయిన రైతన్నలకోసం ఖర్చు పెట్టడానికి  మీనమేషాలు లేక్కవేస్తూ రాక్షసంగా ప్రవర్తిస్తూన్నఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎన్నాళ్ళు సహిద్దాం ?

2 comments:

astrojoyd said...

pedallo chaitanyam teesukurandi mundara..

చిలమకూరు విజయమోహన్ said...

2014వరకు సహించాల్సిందే.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )