రాంగోపాల్ వర్మ గారి అంకితం ఆయన ఇష్టం మనకెందుకు ?

Friday 3 December 2010

ఏ కవి అయినా, రచయిత అయినా తన రచనలను అంకితం ఎందుకిస్తారు ?
ఒకప్పుడు అంటే విద్య నేర్చి పండితులైన వారు తక్కువగా ఉన్న రోజుల్లో కవులు తన కావ్యాలను తమ పోషణను భరించే కళాపోషకులైన  రాజులకో, ధనికులకో అంకితం ఇచ్చి వారిచ్చే భూరి విరాళాలను బదులుగా పొందేవారు !
కొందరు కవులు అలాంటి వారికి భయం కొద్దీ ఇస్తే, మరి కొందరు బ్రతుకుతెరువు కోసం ఇచ్చే వారు !
పోతన వారిలాంటి కొందరు కవులు వ్యక్తుల గొప్పదనాన్ని కాక తాము నమ్మిన భగవంతుని గొప్పదనాన్ని ఎక్కువగా భావించి భగవంతునికి అంకితమిచ్చే వారు ! అప్పటి రోజుల్లో తమ కావ్యాలను తమ కూతుళ్ళతోనూ, అంకితం తీసుకునే వారిని అల్లుళ్ళతోనూ పోల్చుకుని అంకిత కార్యక్రమాన్ని ఒక కల్యాణం లా చేసేవారు ! 
రాచరికాలూ, జమిందారీలూ నశించి, విద్యా వ్యాప్తి అయిన తరువాత రచనలను స్వయంగానో, ఏ పబ్లిషర్ ద్వారానో ముద్రించుకొని అమ్ముకొని తమ పలుకుబడిని బట్టో, తమ రచనల గొప్పదనాన్ని బట్టో వచ్చే సొమ్ముతో బ్రతుకుతూ ఉన్న రోజులు వచ్చాక, పేరుమోసిన వారికి లేకపోతే  తమలానే పబ్లిసిటీ కోసం కళాపోషణలు  చేసినట్లు కనిపించే వ్యక్తులకు అంకితం ఇచ్చి వచ్చే పబ్లిసిటీతో తమ పుస్తక విక్రయం కూడా చేసుకుని పుణ్యం పురుషార్ధం లభించిన ఆనందం పొందే వారు ! పోతనగారిలానే ఇప్పుడు కూడా తాము పూజించే భగవంతునికో, లేదా తాము మనస్పూర్తిగా గౌరవించే వ్యక్తులకు అంకితం  చేసే వాళ్ళూ లేకపోలేదు !
రాంగోపాల్ వర్మ గారు, తనను తాను గౌరవించు కోవడమే  తప్ప ఇతరులకు గౌరవం ఇవ్వరని తెలిసిందే ! మరి ఆయన ఇంకొకరి గొప్పదనాన్ని గుర్తించి తన " నా ఇష్టం " అంకితం ఎలా ఇవ్వగలరు ? ఎవరికీ అంకితం ఇవ్వకుండా ఉన్న కవితలూ, రచనలూ కూడా కోకొల్లలు ! తనూ అలా చేస్తే మరి పబ్లిసిటీ రాదే ! తనకు తాను అంకితం ఇచ్చుకుంటున్నారంటే  అహం బ్రహ్మాస్మి అని, తానే చిత్రసీమలో అతి గొప్ప వ్యక్తి అని మనను నమ్మించడానికి చేసే ప్రయత్నం అన్నమాట !
కష్టమరే రాజు అని నమ్మే ఈ రోజుల్లో కూడా నా ఇష్టం వచ్చినట్లు చరిత్రను చెబుతా మీ కిష్టమైతే చూడండి లేకపోతే మీ ఖర్మ అని చెప్పేసే రాంగోపాల్ వర్మ గారు తన సినిమాలలో ఉన్న సరుకు కన్నా, తానిచ్చే పబ్లిసిటీతో ( కొన్ని సార్లు చాలా చీప్ గా ) నిర్మాతకు డబ్బులు రప్పించే అలవాటు ఉన్నవారు ! ఎంత గొప్ప కళాకారుడికి అయినా కొన్ని పరిమితులు ఉంటాయి ! ఆ పరిమితులకు లోబడి చేసే రచనలు, లేదా సినిమాలూ విషయం కొత్తగా ఉన్నంత వరకూ ఆస్వాదించబడతాయి ! మరి ఒక ఖార్ఖానా పెట్టి కుప్పలు కుప్పలుగా తీసే సినిమాలలో కొత్తదనం లేక చిత్తవకూడదని ఏదో ఒక పబ్లిసిటీ చేసేసే వర్మగారు అదే అలవాటుతో తన రచనకు పబ్లిసిటీ ఇస్తున్నారు అంతే ! అందులో కూడా అలవాటు ప్రకారం ఇతరులను చిన్నచూపుతో చూపించడం తప్ప ఏమీ ఉండకపోవచ్చు ! తొందరపడి కొనకండి తస్మాత్ జాగ్రత్త ! 

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )