రక్తం రుచి మరిగిన రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు మీకూ వినిపిస్తోందా ?

Thursday, 23 December 2010

సాధారణంగా ఒక పార్టీ నేత నిరాహార  దీక్ష చేస్తున్నాడంటే  ఇతర పార్టీల వాళ్ళు సానుభూతి చూపిస్తుంటారు ! కానీ తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేత అయిన  చంద్రబాబునాయుడుగారి  దీక్ష ఏడవరోజులోకి ప్రవేశించినా ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి తన స్థాయిని మరిచి కఠిన మైన పదాలతో వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే కొంత ఆశ్చర్యం మరింత అనుమానమూ కలుగుతోంది ! అనుభవ రాహిత్యం వల్లనో, లేక తెలుగు భాష మీద పట్టు లేకపోవడం వల్లో కిరణ్ కుమార్ రెడ్డిగారు జడ్చర్ల సభలో అలా అన్నారేమో అనుకుందామంటే నమ్మబుద్ధి కావడం లేదు ! రాజ శేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గరనుండీ కాంగ్రెస్ వారంతా అసెంబ్లీ లో కూడా నోటి దురుసుదనంతో చంద్రబాబుగారిని దూషించి వారికి సంభందించిన ముఖ్యమైన విషయాల మీద ప్రతిపక్షం చర్చించకుండా ఉండేలా చూసుకునేవారు ! కానీ అది వేరు అది వాళ్ళ రాజకీయ ఆయుధం ! కానీ ఒక వ్యక్తి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఇది ఏదో వ్యూహం లానే ఉన్నట్లు కనిపిస్తోంది ! చంద్రబాబుగారిని రాజకీయంగా ఎదురు కోవడం కష్టం అనిపించి ముందు కె.సి.ఆర్. గారితోనూ తరవాత చిరంజీవిగారితోనూ తెరవెనుక సంభందాలు ఏర్పరుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఇలా ప్రవర్తించడం వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అని అనిపిస్తోంది ! అవినీతి స్కాంలతోనూ, అధిక ధరల తోనూ తమ పలుకుబడిని పూర్తిగా మసకబార్చుకున్న కాంగ్రెస్ కు శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ సమర్పించే సమయంలో వచ్చిన ఈ అవకాశం వల్ల  తంతే గారెల బుట్టలో పడ్డట్లు అనిపిస్తోందేమో ! శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్  సమర్పించిన తరువాత పరిణామాలను ఎదుర్కోవడానికి ఈ పరిస్థితిని ఆయుధంగా వాడుకోవచ్చనీ, ఒకవేళ చంద్రబాబుగారు లేకుండా ఉండే పరిస్థితి (పాపం శమించు గాక) వచ్చినా తమ చేతికి మట్టి అంటకుండా గట్టి ప్రత్యర్ధిని తప్పించుకున్నట్లు అవుతుందని చిత్తూరు జిల్లా నుంచే వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు భావిస్తూ తమ అధిష్టానాన్ని కూడా ఒప్పించి జిల్లాలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి పన్నిన పన్నాగం కాదు కదా ? ఎలాగూ జగన్ వల్ల, తెలంగాణా సమస్య వల్ల, అధిక ధరల వల్ల, తన పదవి ఎలాగూ స్వల్పకాలానికే కాబట్టి పోయేదేమీ ఉండదనీ, కాంగ్రెస్ పార్టీ కూడా  ముందు ముందు రాజకీయ లబ్ది కోసం ఈ అవకాశాన్ని వాడుకోవచ్చనీ, ప్రజలకు పెద్దగా గుర్తు పెట్టుకునే అలవాటు ఉండదు కాబట్టి కొన్నాళ్ళ తరువాత 2014 ఎన్నికలలో  కాంగ్రెస్ ఇప్పుడున్న తోకగాళ్ళను పక్కనపెట్టి జగన్ ను దీటుగా ఎదుర్కొని స్వయంగానే అధికారం లోకి రావచ్చనీ, పైగా కేంద్రంలో స్వల్ప మెజారిటీ వచ్చినప్పుడు సమీకరణాలను అటూ ఇటూ చేయడంలో ముందు ఉండగల చంద్రబాబు నాయుడు గారు లేకుంటే అక్కడా ఎదురు ఉండదనీ  వీళ్ళ ప్లానా ?  కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యంగ్యాస్త్రాలతో చంద్ర బాబు నాయుడు గారిని రెచ్చ కొట్టడంలో వారిని దీక్ష పొరబాటున కూడా విరమించనీయకుండా  పౌరుషంతో కొనసాగించేందుకు పురికోల్పుదామనే ఆలోచన కనిపిస్తూ,  నాకు ఎందుకో మరి రక్తం రుచి మరిగిన రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు వినిపిస్తోంది ! మీకూ వినిపిస్తోందా ?

1 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )